Site icon HashtagU Telugu

Varanasi: మ‌హేష్ బాబు- రాజ‌మౌళి మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ కూడా సూప‌ర్‌, వీడియో ఇదే!

Varanasi

Varanasi

Varanasi: భారతీయ సినీ ప్రియులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విజువల్స్ విడుద‌ల అయ్యాయి. ఇప్పటివరకు ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఉన్న ఈ భారీ చిత్రానికి అధికారికంగా ‘వారణాసి’ (Varanasi) అనే పేరు ఖరారైంది.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో టైటిల్ రివీల్, గ్లింప్స్ కోసం గ్రాండ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది. అయితే అధికారిక లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం కాకముందే వేదిక వద్ద వీడియో అసెట్ టెస్టింగ్ జరుగుతున్న సమయంలో టైటిల్, కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి.

Also Read: SSMB 29: మ‌హేష్ బాబు- రాజ‌మౌళి మూవీ టైటిల్ ఇదేనా?

నందిపై మహేష్‌.. భయానక లుక్!

టైటిల్ గ్లింప్స్ విజువల్స్‌లో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. విజువల్స్ ప్రకారం.. మహేష్ బాబు నంది (శివుడి వాహనం)పై కూర్చుని ఉన్నారు. ఆయన ఒళ్లంతా రక్తం పూసుకుని, చేతిలో శక్తివంతమైన త్రిశూలం పట్టుకుని కనిపించారు. ఈ దృశ్యాలు సినిమా థీమ్ శివతత్వం, పురాతన అడ్వెంచర్, ఉగ్రరూపం దాల్చిన నాయకుడి పాత్రను సూచిస్తున్నాయి. ‘వారణాసి’ టైటిల్ కూడా పవిత్ర క్షేత్రాన్ని సూచిస్తూ సినిమా కథా నేపథ్యంపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తుండడంతో ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ స్థాయిలో అంచనాలను పెంచుతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం RFC వద్ద అభిమానులు ఉత్సాహంతో ఉప్పొంగుతున్నారు. అధికారిక గ్లింప్స్ విడుదలైన తర్వాత ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version