Tillu Square: ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
‘టిల్లు స్క్వేర్’ నుంచి ఇప్పటికే విడుదలైన ‘టికెటే కొనకుండా’, ‘రాధిక’ పాటలు విశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ అనే పాట విడుదలైంది. సోమవారం వారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన వేడుకలో ఈ పాటను విడుదల చేశారు.
అచ్చు రాజమణి స్వరపరిచిన ‘ఓ మై లిల్లీ’ మెలోడీ సాంగ్ కట్టి పడేస్తోంది. గాయకుడు శ్రీరామ్ చంద్ర తన మధుర స్వరంతో మాయ చేశాడు. సిద్ధు, రవి ఆంథోనీ సాహిత్యం అద్భుతంగా కుదిరింది. తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించారు. ఇక లిరికల్ వీడియోలో సిద్ధు, అనుపమ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “డీజే టిల్లు చేసే సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాము. కానీ టిల్లు స్క్వేర్ పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా, మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాము. టిల్లు పాత్ర అలాగే ఉంటుంది. కానీ కథ మాత్రం వేరేలా ఉంటుంది” అన్నారు.