NTR’s Kondaveeti Simham: ‘కొండవీటి సింహం’‌కు నేటితో 41 ఏళ్ళు!

‘‘ట్రెండ్ ఫాలోకావడం కంటే.. ట్రెండ్ ను క్రియేట్ చేద్దాం’’ అనే డైలాగ్ ను అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ నిజం చేసి చూపారు.

  • Written By:
  • Updated On - October 7, 2022 / 11:30 AM IST

‘‘ట్రెండ్ ఫాలోకావడం వేరు.. ట్రెండ్ ను క్రియేట్ చేయడం వేరు’’ ఈ డైలాగ్ ను అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ నిజం చేసి చూపారు. అందుకే ఆయన ఇటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో తిరుగులేని నాయకుడిగా, స్టార్ గా వెలుగొందారు. శంకరభరణం లాంటి సినిమాలు తెలుగు తెర మీద మాయ చేస్తున్న రోజుల్లోనూ ఎన్టీఆర్ గేర్ మార్చి తనదైన స్టైల్ సినిమాలు చేేస్తూ తెలుగు ప్రేక్షకులను రంజింపచేశారు. సీనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ మూవీలో కొండవీటి సింహం ఒకటి. 1981 అక్టోబర్‌7న రిలీజైన బాక్సాఫీస్‌ హిట్ ‘కొండవీటి సింహం’‌కు నేటితో 41 ఏళ్ళు. రాయలసీమ ఏరియాలో మార్నింగ్‌ షో సంస్కృతిని ప్రవేశపెట్టి,రోజూ 4 ఆటల పద్ధతిని నేర్పింది ఈ చిత్రమే.50రోజులకు 1.21 కోట్ల గ్రాస్‌ సంపాదించింది.అప్పటికి సరికొత్త ఇండస్ట్రీ రికార్డు అది.

1981 సంవత్సరం. దీనికి అయిదారేళ్ళ ముందు ఎన్టీఆర్ వయసైపోతోంది, ఇక హీరోగా మాస్ పాత్రలు చేయడం కష్టమనుకుంటున్న తరుణంలో ‘అడవిరాముడు’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. దాని వసూళ్ల దెబ్బకు తారకరాముడి స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి తెలిసి వచ్చింది. అదే ఊపులో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లాంటి బ్లాక్ బస్టర్లు చరిత్రను తిరగరాస్తూనే వచ్చాయి . రోజా మూవీస్ అధినేత అర్జునరాజుకు ‘వేటగాడు’ అలా కనక వర్షం కురిపించినదే. అన్నగారితో మరో సినిమా తీయాలనే సంకల్పం ఆయనది. ఆ మాటే నేరుగా అన్నగారికే వెళ్లి చెప్పినప్పుడు దర్శకుడిగా రాఘవేంద్రరావు పేరు వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

కానీ సిద్ధంగా కథ లేదు. రచయిత సత్యానంద్ తమిళంలో వచ్చిన తంగపతకం(1976)ని సూచించారు. అప్పటికే దాని డబ్బింగ్ వెర్షన్ ని అల్లు రామలింగయ్య గారు గీత ఆర్ట్స్ సంస్థ నుంచి ‘బంగారు పతకం’గా డబ్బింగ్ చేసి విజయం అందుకున్నారు. అందుకే దాన్నే రీమేక్ చేస్తే రిస్క్ అవుతుందేమో అనే అనుమానం అందరికీ వచ్చింది. కానీ సత్యానంద్ కొన్ని కీలక మార్పులు చేసి కొత్త వెర్షన్ వినిపించారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు తన సంతానంలో దారి తప్పిన ఓ కొడుకుకు మధ్య సంఘర్షణగా సరికొత్త ట్రీట్మెంట్ తో సిద్ధం చేశారు. హీరోయిన్ గా లక్కీ గర్ల్ శ్రీదేవి ఎంపిక కాగా కీలకమైన క్యారెక్టర్ మోహన్ బాబుకు దక్కడం కెరీర్లో పెద్ద బ్రేక్.

కర్తవ్యనిర్వహణ అనే మాస్‌ ఎలిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ – రెండింటినీ రంగరించిన చిత్రం ఇది. ఎస్పీ రంజిత్‌ కుమార్‌గా తండ్రి పాత్రలో ఎన్టీఆర్‌ గంభీరమైన నటనకు జనం జేజేలు పలికారు. ఆ రోజుల్లో 47 ప్రింట్లతో, 43 కేంద్రాల్లో ‘కొండవీటి సింహం’ రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో క్రిక్కిరిసిన ప్రేక్షకులతో 70 రోజులాడింది. అప్పటికి అత్యధికంగా 37 కేంద్రాలలో వంద రోజులు జరుపుకొంది. ఏకంగా 15 కేంద్రాల్లో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది. వైజాగ్‌లో షిఫ్టులతో 315 రోజులు ప్రదర్శితమైంది. అలాగే, లేట్‌ రన్‌లో సైతం ఈ బాక్సాఫీస్‌ సింహం దాదాపు 200 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం, 15 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఫస్ట్‌ రిలీజుకు నాలుగు నెలల తర్వాత రిలీజైన అనకాపల్లిలో నేరుగా 178 రోజులు ఆడి, లేట్‌ రన్‌లో ఇప్పటికీ స్టేట్‌ రికార్డుగా నిలిచి ఉంది.