Gabbar Singh : బాలీవుడ్‌లో అలనాడు ఒక సంచలనం ‘షోలే’ సినిమా. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాలోని ఒక క్యారెక్టర్ నేటికీ ప్రజలందరికీ బాగా గుర్తుంది. అదే.. గబ్బర్ సింగ్. ఈ పాత్రలో జీవించిన అద్భుత నటుడు అమ్జద్ ఖాన్. ఇవాళ ఆయన జయంతి. 1940 నవంబరు 12న జన్మించిన అమ్జద్ ఖాన్ 1992 జులై 27న చనిపోయారు. ఆయన నటుడిగానే కాకుండా పలు సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. అమ్జద్ ఖాన్ తండ్రి పేరు జకరియా ఖాన్. అయితే మూవీ ఇండస్ట్రీలో జకరియా ఖాన్‌ను అందరూ జయంత్ అని పిలిచేవారు. జయంత్ కూడా చాలా సినిమాల్లో నటించారు. ప్రఖ్యాత నటులు దిలీప్ కుమార్, మధుబాల, కిశోర్ కుమార్‌లతో కలిసి పలు మూవీల్లో నటించే అవకాశాన్ని ఆనాడు జయంత్ పొందారు. ఆయన నట వారసత్వాన్నే అమ్జద్ ఖాన్ తదుపరి కాలంలో కంటిన్యూ చేశారు. షోలేలో గబ్బర్ సింగ్‌గా అద్భుతంగా నటించి నేటికీ సినీ ప్రియులకు గుర్తుండిపోయారు.
Also Read :4B Movement : పురుషులపై మహిళల ప్రతీకారం.. సౌత్ కొరియాలో ‘4బీ ఉద్యమం’ ఎందుకు మొదలైంది ?
షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్ లాంటి చాలామంది స్టార్లు నటించారు. అయితే వారందరికి ధీటుగా అమ్జద్ ఖాన్ (Gabbar Singh) నటించారు. దీంతో ఆయన మాత్రమే షోలేలో హైలైట్ అయ్యారు. డైలాగ్ డెలివరీ, హావభావాలు, క్యారెక్టర్‌లో ఇమిడిపోవడం వంటివి చూస్తే.. గబ్బర్ సింగ్ పాత్రను అమ్జద్ ఖాన్ తప్ప మరెవ్వరు ఆ రేంజులో చేయలేరని అనిపిస్తుంది. మొత్తం మీద బాలీవుడ్‌లో అలనాడు విలన్ పాత్రకు అద్భుతమైన పేరు తెచ్చిన నటుడు అమ్జద్. విలన్ పాత్రతోనూ మూవీ ఇండస్ట్రీలో మంచి ఖ్యాతిని గడించవచ్చు అని ఆయన నిరూపించారు. అమ్జద్‌కు కుమారుడు పుట్టిన రోజే.. షోలే సినిమా టీమ్‌తో ఆయనకు అగ్రిమెంటు కుదిరింది. తదుపరిగా ఈ సినిమానే అమ్జద్ కెరీర్‌లో పెద్ద మైలురాయిగా నిలిచింది. ‘చోర్ పోలీస్’, ‘అమీర్ ఆద్మీ గరీబ్ ఆద్మీ’ అనే రెండు సినిమాలకు అమ్జద్ ఖాన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అయితేే అవి సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం అమ్జద్ ఖాన్ కుమారుడు షాదాబ్ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ‘రాజా కీ ఆయేగీ బారాత్’ అనే మూవీలో ఆయన నటించారు. ఇందులో రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించారు.