చెన్నై, తమిళనాడు: (Kamal Haasan) – చెన్నైలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఎంఎన్‌ఎం అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ మాట్లాడుతూ విజయ్ బహిరంగ సభలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఓటు వేయరని స్పష్టం చేశారు. ఇది కేవలం విజయ్‌కు మాత్రమే కాదు అన్ని రాజకీయ నాయకులకు వర్తిస్తుందన్నారు. తనకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరికీ ఇదే పరిస్థితి అని వివరించారు.
విజయ్‌ను ఉద్దేశించి ఏమైనా సలహా ఇస్తారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కమల్ ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ మాటలు ఎప్పుడైనా నాయకులందరికీ చెప్పే విషయమేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో మాత్రమే కాదు సినిమా రంగంలోనూ కొత్తవారిపై విమర్శలు వస్తాయని, ఇది సహజం అని అన్నారు.
తిరువారూర్‌లో జరిగిన ఓ సభలో విజయ్ సభకు వచ్చినవారు ఓటు వేస్తారా అన్న సందేహం వ్యక్తం చేయగా, ప్రజలు “విజయ్” అంటూ నినాదాలు చేశారు. విజయ్‌కి మద్దతు తెలుపుతూ తాము ఓటు వేస్తామని పరోక్షంగా చెప్పారు. ఇందుకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు.
విజయ్ రాజకీయాల్లోకి “తమిళగ వెట్రి కళగం” పేరుతో పార్టీని ప్రారంభించారు. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. మదురైలో జరిగిన సభలో వచ్చే ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు. బీజేపీకి తమిళనాడులో పాదం ఉండదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు.
కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. 2021 ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఎదుర్కొంది. కమల్ హాసన్ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఇండియా కూటమిలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు దక్కింది. ఆయన ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజా వ్యాఖ్యల ద్వారా కమల్ హాసన్ ప్రజాసభలు వేరు, ఓటింగ్ వేరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇది కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నవారికి ఓ గమనికగానే చెప్పవచ్చు.
