- బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కు ప్రమాదం
- ముంబైలోని అంబోలీ ప్రాంతంలో గల లింక్ రోడ్డుపై ఈ ప్రమాదం
- మద్యం మత్తులో నోరా కార్ కు డాష్ ఇచ్చిన వ్యక్తి
Nora Fatehi Car Accident : బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్, నటి నోరా ఫతేహీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముంబైలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నోరా ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని అంబోలీ ప్రాంతంలో గల లింక్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. నోరా ఫతేహీ ఒక ముఖ్యమైన మ్యూజిక్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు తన కారులో వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న ఒక వాహనం అతివేగంతో ఆమె కారును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఉన్న నోరా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Nora Fatehi
ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితుడు మద్యం సేవించి వాహనాన్ని అదుపులేకుండా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని అంబోలీ పోలీసులు నిర్ధారించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే అతివేగంగా వాహనం నడిపినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో నోరా ఫతేహీకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వార్త తెలిసిన ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే తిరిగి కోలుకుంటారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించవద్దని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
