Niharika : ఇటీవల వచ్చిన వర్షాలకు వరదలు ఏర్పడి ఏపీ, తెలంగాణాలో అనేక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అయితే వరద బాధితుల కోసం టాలీవుడ్ లోని అనేక సెలబ్రిటీలు ఇప్పటికే తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ భారీగా విరాళాలు ప్రకటించింది. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్, గ్రామాలకు సాయంకు మెగా ఫ్యామిలీలోని హీరోలంతా కలిపి ఆల్మోస్ట్ 10 కోట్ల విరాళం ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రమే కాక 400 గ్రామాలకు ఒక్కో గ్రామానికి లక్ష రూపాయల చొప్పున సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ బాటలోనే నిహారిక కూడా అలాగే హెల్ప్ చేసింది. బుడమేరు ముంపుతో ఇబ్బంది పడిన పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి 50 వేలు చొప్పున మొత్తం అయిదు లక్షలు విరాళంగా ప్రకటించింది.
ఈ మేరకు నిహారిక తన సోషల్ మీడియాలో.. బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారి చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నేను కూడా ఈ బృహత్కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షలు రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలిపింది.
బాబాయ్ పవన్ కళ్యాణ్ బాటలో నిహారిక ఇలా సహాయం చేయడానికి ముందుకు రావడంతో అభిమానులు, నెటిజన్లు నిహారికని అభినందిస్తున్నారు. ఇటీవలే నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు సినిమాతో మంచి విజయం సాధించింది.
Also Read : Allu Arha : వినాయక పూజ చేస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ.. క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ..