Nidhhi Agerwal : రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి, తాకే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ , రిద్ధి కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్లు మార్చుకున్న ఈ పాన్ ఇండియా మూవీని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం నిర్వహించిన ఈవెంట్ లో నిధికి చేదు అనుభవం ఎదురైంది.
‘ది రాజాసాబ్’ నుంచి ‘సహన సహన’ అనే సెకండ్ సాంగ్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని లులు మాల్‌లో ఈవెంట్ నిర్వహించారు. హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లతో పాటుగా దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, SKN హాజరయ్యారు. దీనికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టారు. హీరోయిన్లు కూర్చున్న సోఫాల మీదకు దూసుకొచ్చారు. ఒకానొక టైంలో SKN వాళ్లను వారించినా వినిపించుకోలేదు.
ఈవెంట్ అయిపోయిన తర్వాత నిధి అగర్వాల్ కారు వద్దకు వస్తున్న సమయంలో అభిమానులు ఆమెను చాలా ఇబ్బందికి గురి చేశారు. పెద్ద ఎత్తున ఆమెను చుట్టు ముట్టారు. ఒడియమ్మా బంటీ అంటూ అత్యుత్సాహంతో ఆమెపై పడిపోయారు. కొంతమంది ఆమెను తాకే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ కూడా ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోయారు. చివరకు ఎలాగోలా కారు ఎక్కిన నిధి.. ఇదంతా ఏంటి అంటూ చిరాకు పడ్డారు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశారు.
రాజాసాబ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ని అభిమానులు ఇబ్బంది పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎంతగా ఇబ్బంది పడ్డారనేది ఇందులో క్లియర్ గా కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అంటున్నారు. అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేయకూడదని, అందులోనూ ఒక హీరోయిన్ మీద పడిపోవడం సరికాదని అంటున్నారు.
నిధి అగర్వాల్ వీడియోపై సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నక్కల కంటే దారుణంగా ప్రవర్తించే మగాళ్ల గుంపు ఇది. నక్కలను ఎందుకు అవమానించాలి? ఒకే రకమైన మనస్తత్వం ఉన్న మగాళ్లను గుంపుగా చేర్చితే, వారు ఒక మహిళను ఇలాగే వేధిస్తారు. దేవుడు వీళ్లందరినీ తీసుకెళ్లి వేరే గ్రహం మీద ఎందుకు పడేయడు?” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
