Nayanthara : హీరో ధనుష్‌పై లేడీ సూపర్ స్టార్ నయనతార నిప్పులు చెరిగింది. అభిమానులకు కనిపించే ధనుష్ వేరు.. అసలైన ధనుష్ వేరు అంటూ ఫైర్ అయింది. ‘‘ఫ్యాన్స్‌కు చెప్పే సూక్తులను నువ్వు పాటించవ్’’ అంటూ ధనుష్‌పై నయనతార విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ఒక బహిరంగ లేఖను ఆమె విడుదల చేయడంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది. ఇంతకీ నయనతారకు(Nayanthara) ధనుష్‌పై ఎందుకంత కోపం వచ్చింది ? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
#SpreadLove and Only Love 🫶🏻 pic.twitter.com/6I1rrPXyOg
— Nayanthara✨ (@NayantharaU) November 16, 2024
Also Read :Heroic Action : రైల్వేశాఖ హీరోయిక్ మిషన్.. జెట్ స్పీడుతో గమ్యస్థానానికి వరుడి కుటుంబం
నయనతార జీవితం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. అందులో ఆమె సినీప్రయాణం, ప్రేమ, పెళ్లి వివరాలన్నీ ఉన్నాయి. ఇక నయనతారతో తమకున్న అనుబంధం గురించి తోటి నటీనటులు చెప్పడం కూడా అందులో ఉంటుంది. వాస్తవానికి ఈ డాక్యుమెంటరీ నిర్మాణం పూర్తయి చాలా కాలమే అయింది. 2015లో విడుదలైన ‘నానుమ్ రౌడీ దాన్’ అనే మూవీలో నయనతార ప్రధాన పాత్రలో నటించారు. ఆ సినిమాకు డైరెక్టర్‌గా ఆమె భర్త విఘ్నేష్ శివన్ వ్యవహరించారు. అయితే ఆ మూవీకి నిర్మాత హీరో ధనుష్. నయనతార జీవిత కథ ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలోని కొన్ని ఫొటోలు, వీడియోలు, పాటలను వాడుకోవాలని భావించారు. దీనికోసం అనుమతి కోరుతూ చాలాసార్లు ధనుష్‌కు నయనతార, నెట్‌ఫ్లిక్స్ టీమ్ లేఖలు రాశారు. నేరుగా సంప్రదించారు. అయినా స్పందన రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన నయనతార ఇప్పుడు ధనుష్‌పై ఫైర్ అవుతూ బహిరంగ లేఖను విడుదల చేశారు.
నా హృదయాన్ని ముక్కలు చేశారు
‘‘ధనుష్ మీరు చేసింది సరికాదు.. నెట్‌ఫ్లిక్స్‌లో నా లైఫ్ డాక్యుమెంటరీ రిలీజ్ టైం దగ్గరపడినా.. మీ అనుమతి కోసం ఎదురుచూశాం. చివరకు మేం ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడంతో నా డాక్యుమెంటరీని రీ ఎడిట్ చేయించాం. ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీలోని పాటలు వాడుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది’’ అని బహిరంగ లేఖలో నయనతార ప్రస్తావించారు. ఇక నయనతారపై రూపొందించిన డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబరు 18న విడుదల కానుంది. ఆ డాక్యుమెంటరీకి ‘నయనతార : బియండ్ ది ఫెయిరీ టేల్’ అని పేరు పెట్టారు. నవంబరు 18న నయనతార 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు.
Also Read :Jake Paul vs Mike Tyson : మైక్ టైసన్‌ను ఓడించిన యూట్యూబర్.. ఇద్దరికీ వందల కోట్లు!
చట్టపరంగా ఎదుర్కోవడానికి మేం రెడీ
‘‘నా జీవితంలో ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీ చాలా ముఖ్యమైంది. నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని మన అందరికీ తెలుసు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి నేను ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా’’ అని ఆమె స్పష్టం చేశారు. ‘‘ధనుష్.. నా డాక్యుమెంటరీకి సంబంధించి ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై మీరు లీగల్ నోటీసు పంపినందుకు షాకయ్యాను. ఈ చర్య మీరు ఎలాంటి వ్యక్తి అనేది తెలియజేస్తుంది. మీరు స్టేజ్ పై మాట్లాడే మాటలను పాటించరని నాకు, నా భర్తకు తెలుసు. ఒక నిర్మాత తన సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాన్ని, స్వేచ్ఛను నియంత్రించగలడా? చట్టపరంగా ఎదుర్కోవడానికి కూడా మేం రెడీ. నానుమ్ రౌడీతాన్ మూవీకి సంబంధించిన సన్నివేశాలు పాటలకు కాపీరైట్ నో హోల్డ్ బ్యార్డ్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను దయచేసి కోర్టుకు వివరించండి’’ అని నయనతార కోరారు.