RRR: ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ ‘నాటు నాటు’.. అవార్డుకి అడుగు దూరంలో..!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఈ పాటకు నామినేషన్‌ వచ్చింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను చంద్రబోస్‌ రచించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని గీతంలో రామ్‌చరణ్‌, తారక్‌ నటించారు.

  • Written By:
  • Updated On - January 25, 2023 / 11:12 AM IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఈ పాటకు నామినేషన్‌ వచ్చింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను చంద్రబోస్‌ రచించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని గీతంలో రామ్‌చరణ్‌, తారక్‌ నటించారు. ఇప్పటికే ఈ పాటకు, సినిమాకు వివిధ అంతర్జాతీయ పురస్కారాలు దక్కిన విషయం తెలిసిందే. సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌‌కు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి ‘నాటు నాటు సాంగ్’ ఎంపిక కావడంపై ఆ మూవీ యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ‘సరికొత్త చరిత్ర సృష్టించాం’ అంటూ ట్వీట్ చేసింది. కాగా.. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కడం విశేషం.

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్‌ అయిన తొలి ఇండియన్‌ మూవీగా `ఆర్‌ఆర్‌ఆర్‌` రికార్డు సృష్టించింది. అయితే ఈ చిత్రం ఒరిజినల్‌ సాంగ్‌తోపాటు ఉత్తమ యాక్టర్‌(ఎన్టీఆర్‌), ఉత్తమ దర్శకత్వం (రాజమౌళి) వంటి విభాగంలోనూ ఆస్కార్‌ నామినేషన్‌కి పోటీ పడింది. ఎన్టీఆర్‌కి ఉత్తమ నటుడిగా విభాగంలో నామినేషన్‌ కచ్చితంగా దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరకు నిరాశే మిగిలింది.

ఆస్కార్ నామినేషన్స్ ఫైనల్ లిస్ట్‌లో ‘నాటు నాటు’ పాట చోటు దక్కించుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. మైలురాయికి అడుగుదూరంలో ఉన్నామని ట్వీట్ చేశారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం..‘‘ఆస్కార్‌ను తప్పకుండా తీసుకువస్తారని భావిస్తున్నా. చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు’’ అని ట్వీట్ చేశారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సాంగ్ ఆస్కార్​కు నామినేట్ కావడం తనకు గొప్ప ఆనందాన్నిచ్చిందని తెలిపారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా `నాటు నాటు` పాటని చంద్రబోస్‌ రాశారు. కాలభైరవతో కలిసి రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు.