Aadarsha Kutumbam Ak47 విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ సినిమాలో మరో హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నెగెటివ్ షేడ్స్ కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు. ఇందులో నారా రోహిత్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ గా ఉండేలా ఈ పాత్ర ఉంటుందట. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాలతోపాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. అయితే దాన్ని మరింత రెట్టింపు చేసేలా, ఈ చిత్రంలో మరో హీరో భాగం కాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అది మరెవరో కాదు, నారా రోహిత్ అని అంటున్నారు. సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఇది కథలో చాలా కీలకమైన క్యారెక్టర్ అని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. పాత్ర నచ్చడంతో నారావారబ్బాయి వెంటనే ఓకే చేశాడని, త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
త్రివిక్రమ్ సినిమాలో హీరోతో పాటుగా మరో ప్రముఖ నటుడు కనిపిస్తూ ఉంటారు. ‘S/o సత్యమూర్తి’ మొదలుకుని, చాలా సినిమాలలో అలాంటి పాత్రలు ఉన్నాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో శ్రీవిష్ణు, ‘అజ్ఞాతవాసి’లో ఆది పినిశెట్టి, అరవింద సమేత వీర రాఘవ’ మూవీలో నవీన్ చంద్ర, ‘అల వైకుంఠపురంలో’ సుశాంత్, ‘గుంటూరు కారం’ సినిమాలో రాహుల్ రవీంద్రన్ నటించారు. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో నారా రోహిత్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
నారా రోహిత్ కెరీర్ ప్రారంభం నుంచీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. కొన్ని చిత్రాల్లో గెస్టు రోల్స్ కూడా చేశారు. కొన్నాళ్లపాటు గ్యాప్ తీసుకున్న ఆయన.. లాస్ట్ ఇయర్ భైరవం సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. సుందరకాండ అనే చిత్రంతో అలరించారు. అప్పట్లో పుష్ప 2 లో యాంటీ కాప్ రోల్ లో నటించే అవకాశం వస్తే, తాను రిజెక్ట్ చేసినట్లుగా రోహిత్ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ మూవీలో యాంటీ కాప్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పుకుంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
