టాలీవుడ్ హీరో నారా రోహిత్, ఆయన భార్య, హీరోయిన్ సిరి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త నారా అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఎంతో సంతోషాన్ని నింపుతోంది. సినిమాల ఎంపికలో ఎంతో వైవిధ్యం చూపే రోహిత్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంలోకి అడుగుపెడుతుండటం విశేషం.
నారా రోహిత్, సిరి ‘ప్రతినిధి-2’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్‌లో వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం జరిగిన ఏడాది లోపే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతుండటం విశేషం. సిరి సీమంతం వేడుకకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, ఈ శుభవార్తపై అధికారికంగా స్పష్టత వచ్చినట్లయింది.
నారా రోహిత్ ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన కెరీర్‌లో కూడా బిజీగా ఉన్నారు. గతేడాది ‘భైరవం’ చిత్రంతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో రోహిత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
