Site icon HashtagU Telugu

Taraka Ratna: విషాదం.. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత

Tarakaratna

Tarakaratna

నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) కన్నుమూశారు. గుండె పోటుతో 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కాసేపట్లోనే దీనిపై వైద్యులు తుది ప్రకటన చేయనున్నారు. ఆయన మరణ వార్తతో నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర విచారంలో మునిగిపోయారు.

కార్డియాక్‌ అరెస్ట్‌ తీవ్రత కారణంగా తారకరత్న శరీరంలోని పలు అవయవాలు పని చేయకుండా పోయాయి. మెదడు సైతం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగింది. ఆయనకు ప్రత్యేక వైద్యం అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అత్యంత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

23 రోజుల క్రితం నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో నడుస్తూ కుప్పకూలారు. యాత్ర ప్రారంభమైన కాసేపటికి సమీపంలో ఉన్న మసీదులోకి నారా లోకేశ్‌ వెళ్లారు. లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు అంతా గుంపుగా తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా మీద పడ్డట్టు రావడంతో తారకరత్నకు ఊపిరి ఆడలేదు. ఇదే విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వాళ్లు.. టీడీపీ కార్యకర్తలను దూరంగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరాడక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. రాత్రి అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకెళ్లారు. 23 రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

Also Read: Heart Failure: యువకుల్లో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించిందిలా

ఎన్టీఆర్‌ వారసుడిగా తారకరత్న సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.  ఒకటో నెంబర్‌ కుర్రాడుతో  ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2002లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దాదాపుగా 23 సినిమాల్లో నటించారు. అమరావతి సినిమాలో ఆయన నటనకు గాను నంది అవార్డును సొంతం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధ్యలో కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యారు.