Site icon HashtagU Telugu

Nandamuri Legacy Continues: నందమూరి వంశం నుంచి మరో వారసుడు ఎంట్రీ!

Nandamuri Legacy Continues

Nandamuri Legacy Continues

నందమూరి తారక రామారావు.. తెలుగు సినిమాకే కాదు, తెలుగు వారితనం కోసం ఒక ఆర్థికత. ఈ పేరు అంటే చరిత్ర, తెలుగు వారికి గర్వం కలిగిస్తుంది. అలాంటి గొప్ప పేరును మరో వ్యక్తికి పెట్టడం ఆయనకే సాధ్యం. అందుకే తన కుమారుడైన హరికృష్ణ తనయుడైన తారక్‌కు ఆ పేరు పెట్టి ఆశీర్వదించాడు. అలా జూనియర్ ఎన్టీఆర్‌గా నందమూరి తారక రామారావు పేరుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డ్యాన్స్, డిక్షన్, యాక్షన్ — ఏదైనా పర్ఫెక్ట్‌గా చేసే స్టార్ అతనే. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా వెలుగుతున్నాడు. ఇలాంటి ఎన్టీఆర్ సినిమాలలో టాప్ స్థాయిలో ఉన్నప్పుడు, మరో ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ప్రవేశించబోతున్నాడు.

నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు, దివంగత జానకి రామ్ తనయుడి పేరు కూడా నందమూరి తారక రామారావు. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా, కొత్త తారక రామారావును “ఫస్ట్ దర్శన” అంటూ కుర్రాడికి సంబంధించిన ఒక వీడియో విడుదల చేశాడు వైవీఎస్. ఈ వీడియోలో, శాసన సభకు ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేసినట్లుగా ఒక స్క్రిప్ట్ రాసి, అతనికి చదివిస్తూ తన లుక్‌ను పరిచయం చేశాడు. అదెలా ఉందంటే..

‘‘నందమూరి తారక రామారావు అనే నేను.. ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల ఇష్టం పెంచుకుని.. శ్రీ వైవిఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది.. ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న నేను.. ఎందరో మహోన్నత నటీ నటులు, సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న.. మన చలన చిత్ర పరిశ్రమ పట్ల.. నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దానియొక్క సమగ్రతను కాపాడతానని.. కథా రచయిత, దర్శక, నిర్మాతల సంతృప్తిమేరకు కథలు, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింప చేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని .. నా ముత్తాత, నా దైవం, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావుగారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..’’

ఈ కంటెంట్ ను చదువుతుంటే, అతని డిక్షన్ పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. కుర్రాడి గొంతు బాగా ఉంది. ఆయన హైటూ ఆకట్టుకుంటోంది. కుర్రాడు నిజంగా హీరోగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఇక ఇతని ఎంట్రీపై జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రత్యేకంగా పోస్ట్ చేసారు, ‘‘ముత్తాత, తాత, తండ్రుల ఆశిష్సులతో నువ్వు గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ఈ విషెస్ చాలామందిని ఆకట్టుకుంటోంది. నిజంగా, తాత పేరును మనవడు నిలబెట్టాడనే చెప్పాలి. ఈ కొత్త తారక రామారావు కూడా ముత్తాత పేరు నిలబెడతాడా లేదా అనేది చూడాలి.