Nandamuri Balakrishna : తన 64వ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తన జీవిత ప్రయాణం, సేవా అభిముఖత, వ్యక్తిత్వ విశేషాలను ఎంతో హృదయంగా వ్యక్తపరిచారు. సినీ నటుడిగా ఎన్నో విజయాలు సాధించిన ఆయన, రాజకీయ రంగంలోనూ, ఆరోగ్య సేవా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే.
“నెంబర్ పెద్ద విషయం కాదు.. నా వయసు అందరికీ తెలిసిందే,” అని ప్రారంభించిన బాలయ్య, తన చిన్ననాటి సంఘటనల నుంచి తన సినీ ప్రయాణం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో తన పాత్ర వరకు మాట్లాడారు. “ఒకసారి నాన్నగారు ‘మెడిసిన్ అప్లయ్ చేసావా?’ అన్నారు. నేను హీరో అవుతాను అనుకున్నా, నన్ను మెడిసిన్ అంటారా అనిపించింది” అని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.
అలానే, “ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసినప్పటి నుంచి సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేసినదాకా నా ప్రయాణం విశేషమే. అయితే నిజ జీవితంలో ఆరోగ్య సేవల్లో పాల్గొనడం నిజమైన సంతృప్తిని కలిగిస్తోంది” అని అన్నారు.
“పదిహేనేళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా సేవలందిస్తున్నాను. వైద్యులను భగవంతుల్లా చూస్తాం. అలాంటి స్థలంలో సేవ చేయడం నా అదృష్టం. ఎంతోమంది దాతల మద్దతుతో ఈ ఆసుపత్రిని అంతర్జాతీయ స్థాయిలో నడుపుతున్నాం. శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, పేదలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలన్నదే మా లక్ష్యం,” అని బాలకృష్ణ వివరించారు.
“నాకు పొగరు ఉంది అంటారు… అవును, నాకు నా మీద విశ్వాసం ఉంది. నేను నన్ను ప్రేమించుకుంటాను. మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎవరు చేస్తారు? బిరుదులు వచ్చి పడతాయి. కానీ వాటికన్నా ముందు మన పని మనం చేస్తూ పోతే చాలు” అని చెప్పిన ఆయన వ్యాఖ్యలు యువతకు స్పూర్తిగా నిలిచాయి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఈ సందేశం ఆయన్ని అభిమానించేవారికే కాదు, సేవా రంగాన్ని దశదిశలా విస్తరించాలనుకునే వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.
Viral : అమెరికాలో భారత విద్యార్థిపై పోలీసుల అమానుష ప్రవర్తన… వైరల్ అవుతున్న వీడియో