Site icon HashtagU Telugu

Naga Chaitanya : రెగ్యులర్ గా శోభితని తెగ పొగిడేస్తున్న నాగచైతన్య.. తండేల్ ప్రమోషన్స్ లో శోభిత గురించే..

Naga Chaitanya Continuously Praising Sobhita in Thandel Promotions

Chaithu Sobhita

Naga Chaitanya : నాగ చైతన్య తండేల్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. గుజరాత్ కి ఫిషింగ్ కోసం వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి పెట్టుబడి తిరిగి వచ్చిన మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా ఓ ప్రేమ కథను జత చేసి ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడికి వెళ్లినా నాగ చైతన్య శోభిత గురించి మాట్లాడుతున్నాడు. నాగ చైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితని రెండేళ్లు ప్రేమించి గత సంవత్సరం డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో రెగ్యులర్ గా శోభిత – నాగచైతన్య వార్తల్లో నిలుస్తున్నారు. తండేల్ ప్రమోషన్స్ లో శోభిత గురించి అడిగినా, అడగకపోయినా మాట్లాడుతున్నాడు చైతూ. ఇటీవల వైజాగ్ ఈవెంట్లో.. నేను వైజాగ్ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇంట్లో నా భార్య ముందు పరువు పోతుంది అని సరదాగా అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ శోభిత గురించి అడిగితే నేను శోభితని బుజ్జి తల్లి అని పిలుస్తాను. ఈ సినిమాలో బుజ్జి తల్లి సాంగ్ తనకు బాగా ఇష్టం అని చెప్పాడు. ముంబై ఈవెంట్లో చైతు మాట్లాడకపోయినా అల్లు అరవింద్ శోభిత ప్రస్తావన తీసుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో.. శోభితకు చెప్పే ఆమె నిర్ణయం తీసుకున్నాకే ఏ పనైనా మొదలుపెడతాను. తాను నాకు విలువ ఇస్తుంది. నేను తన నిర్ణయాలను గౌరవిస్తాను అని చైతూ అన్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. మా వెడ్డింగ్ ప్లాన్ అంతా శోభితనే చేసింది. ఆ పెళ్లి క్రెడిట్ అంతా శోభితకే దక్కుతుంది. ఆమె తెలుగింటి సాంప్రదాయాలు పాటిస్తుంది. మా పెళ్ళికి సంబంధించి ప్రతిదీ ఆమె డిజైన్ చేసింది. పెళ్లి క్షణాలు నా జీవితంలో మర్చిపోలేనివి అని అన్నారు. ఇలా గ్యాప్ ఇవ్వకుండా ప్రతి ప్రమోషన్ లో , ఇంటర్వ్యూలో నాగ చైతన్య శోభిత గురించి మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో చైతు ఫ్యాన్స్ గతాన్ని వదిలేసి ప్రస్తుతం చైతు హ్యాపీగా ఉంటున్నాడు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ పలువురు సమంత ఫ్యాన్స్ మాత్రం ఇంకా గతాన్ని పట్టుకొని వేలాడుతూ సోషల్ మీడియాలో చైతు, శోభితలను ట్రోల్ చేస్తున్నారు.

Also Read : NTR Fans Meet : త్వరలో ఎన్టీఆర్ ఫాన్స్ మీట్.. ఫ్యాన్స్ ని చల్లబరిచేందుకే..

Exit mobile version