తండేల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ చైతన్య (Naga Chaitanya)…త్వరలో తెనాలి రామకృష్ణగా అలరించబోతున్నట్లు తెలుస్తుంది. దివంగత అక్కినేని నాగేశ్వరరావు పోషించిన పాత్రల్లో తెనాలి రామకృష్ణ (Tenali Ramakrishna) చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ నటించినా, ఏఎన్ఆర్ తన నటనా నైపుణ్యంతో అదరగొట్టి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. రామలింగడు ఎలా ఉంటాడో అనేది పుస్తకాల కంటే ఎక్కువగా ఏఎన్ఆర్ రూపంలోనే ప్రేక్షకుల మనసుల్లో ముద్రపడ్డాడు. అప్పటి నుంచి ఈ పాత్రను మరొకరు పూర్తి స్థాయిలో పోషించలేకపోయారు.
ఇప్పుడు తెనాలి రామకృష్ణ కథ మరోసారి తెరపై రాబోతుందన్న వార్త సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. తండేల్ సక్సెస్ మీట్‌లో దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. త్వరలో ఓ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలైందని, ఇప్పటి ప్రేక్షకులకు తెనాలి రామకృష్ణ కథను ఎలా చెప్పాలనే దానిపై ప్రత్యేకంగా పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బ్యానర్, బడ్జెట్ వంటి వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, నాగచైతన్య తెనాలి రామకృష్ణగా కనిపించనున్నాడా? అన్న ప్రశ్న ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నాగార్జునకు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి వంటి బయోపిక్‌లతో మంచి గుర్తింపు వచ్చినట్టు, నాగచైతన్యకు ఈ సినిమా కెరీర్‌లో ఓ క్లాసిక్‌గా మిగిలిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.