Site icon HashtagU Telugu

Muthiah Muralidaran: అక్టోబర్ 6న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ విడుదల

Muttiah Muralitharan Biopic Announced and First Look poster released

Muttiah Muralitharan Biopic Announced and First Look poster released

లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై వివేక్ రంగాచారి నిర్మించారు. ఈ సినిమా ఆలిండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

వచ్చే నెల 6న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఆయన వెల్లడించారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ”అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘800’ విడుదల చేస్తున్నాం. ఇటీవల క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో విడుదల చేసిన ట్రైలర్ అద్భుతమైన స్పందన అందుకుంది. క్రికెట్ మాత్రమే కాకుండా ముత్తయ్య మురళీధరన్ గారి బాల్యం నుంచి జరిగిన అంశాలు చూపించడంతో ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. క్రికెట్ ప్రేమికులతో పాటు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న చిత్రమిది” అని చెప్పారు.

ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ”నా బయోపిక్ తీస్తానని శ్రీపతి వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు. అతను పట్టు వీడలేదు. శ్రీలంక వచ్చాడు. రెండు సంవత్సరాలు స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అతని కమిట్మెంట్, కథను రాసిన తీరు చూసి ఓకే చెప్పా. కరోనా వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రజలంతా సినిమా చూస్తారని ఆశిస్తున్నా. సినిమా విడుదల చేస్తున్న శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ గారికి థాంక్స్” అని చెప్పారు.
ముత్తయ్య మురళీధరన్ జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ వినమ్రంగా ఉంటాడని, అతని జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని ‘800’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి చిత్రదర్శకుడు ఎంఎస్ శ్రీపతి ‘800’ స్క్రిప్ట్ రాశారు.

Also Read: AR Rahaman Music Concert : తమిళనాడుని ఊపేస్తున్న రెహమాన్ కాన్సర్ట్ వివాదం.. బరిలోకి ఉదయనిధి స్టాలిన్..