Music Director Koti : పరిస్థితుల వల్ల విడిపోయాం.. రాజ్ లేకపోయినా నా పక్కనే పాటల రూపంలో ఉంటాడు.. కోటి ఎమోషనల్..

రాజ్ మరణంతో ఒక్కసారికి కుంగిపోయిన కోటి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. ఇప్పుడు బయలుదేరి తన ప్రాణ మిత్రుడు రాజ్ ని చివరి చూపు చూడటానికి హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు కోటి.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 07:00 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌(Music Director Raj) నేడు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజ్ కోటి(Raj Koti) ద్వయంగా ఈ సంగీత దర్శకులు ఫేమస్ అయ్యారు. రాజ్ కోటి కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి. ఒకానొక సమయంలో రాజ్ – కోటి అంటే సూపర్ హిట్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. రాజ్ సింగిల్ గా కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించారు.

కానీ కొన్నేళ్ల క్రితం రాజ్ – కోటి మనస్పర్థలు వచ్చి విడిపోయారు. రాజ్ – కోటిలు విడిపోయాక వారి సంగీత గ్రాఫ్ కూడా పడిపోయింది. వారు విడిపోయాక కలపాలని మెగాస్టార్, బాలసుబ్రహ్మణ్యం.. చాలామంది ట్రై చేశారు. కానీ వీరు కలవలేదు. రాజ్ చివరిసారిగా ఇటీవలే బేబీ సినిమాలోని ఓ సాంగ్ లాంచ్ కి విచ్చేశారు. దీంట్లో చాలా సంవత్సరాల తర్వాత కోటి పక్కన కూర్చొని కనిపించారు. ఇలా సడెన్ గా రాజ్ మరణించడంతో కోటి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇక పలువురు ప్రముఖులు. అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

రాజ్ మరణంతో ఒక్కసారికి కుంగిపోయిన కోటి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. ఇప్పుడు బయలుదేరి తన ప్రాణ మిత్రుడు రాజ్ ని చివరి చూపు చూడటానికి హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు కోటి.

సంగీత దర్శకుడు, రాజ్ చిన్ననాటి స్నేహితుడు కోటి మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నాను. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నాను. ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం. చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ఇండస్ట్రీలో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటే బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం నా పక్కనే ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్‌ ఎప్పటికీ బతికే ఉంటాడు అని ఎమోషనల్ అయ్యారు.

 

Music Director Raj : ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..