Ilayaraja Controversy : వివాదంలో ఇరుక్కున్న ఇళ‌య‌రాజా.. సంగీత ద‌ర్శ‌కుడిని ఆడుకుటున్న ట్రోల‌ర్స్‌..

సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ పుస్త‌కానికి ఆయ‌న రాసిన ముందుమాటే అందుకు కార‌ణం.

  • Written By:
  • Publish Date - April 16, 2022 / 05:34 PM IST

సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ పుస్త‌కానికి ఆయ‌న రాసిన ముందుమాటే అందుకు కార‌ణం. వివరాల్లోకి వెళితే.. ‘‘అంబేడ్కర్‌ అండ్‌ మోడీ:రీఫార్మర్స్‌ ఐడియాస్‌, పెర్ఫార్మెర్స్‌ ఇంప్లిమెంటేషన్‌’’ అన్న పుస్తకానికి ఈ మ‌ధ్య‌నే మ్యాస్ట్రో ఒక ముందుమాట రాశ‌రు. అందులో ప్రధాని మోదీని అంబేడ్కర్‌తో పోల్చడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ప్రధాని మోడీ వ్యక్తిత్వాల మధ్య ఆకట్టుకునే సామ్యమైన అంశాలు కొన్నింటిని పుస్తకంలో ప్రస్తావించారు. ఈ ఇద్దరూ సామాజికంగా బలహీనవర్గాల ప్రజలు ఎదుర్కొనే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించినవారు. ఇద్దరూ పేదరికాన్ని అనుభవించారు. సామాజిక అణిచివేతను దగ్గరగా చూసినవారు. పేదరికాన్ని, అణిచివేతను కూల్చేసేందుకు కృషిచేసినవారు. ఇద్దరూ దేశం కోసం పెద్దపెద్ద కలలు కన్నారు. వాటిని ఆచరణలో అమలుచేయాలని భావించినవారు’’ అని ఇళయరాజా ఆ పుస్తకానికి రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. అంతేకాదు, మహిళలకు అనుకూలమైన ట్రిపుల్‌ తలాక్‌ చట్టం, ‘బేటీ బచావో..బేటీ పఢావో’ లాంటి పథకాలను అమలుచేసిన ప్రధాని మోదీని చూసి అంబేడ్కర్‌ గర్వపడతారని కూడా ఇళయరాజా ప్రశంసించారు.

అయితే, మోడీని అంబేడ్క‌ర్‌తో పోలుస్తూ ఇళ‌య‌రాజా చేసిన ఈ వ్యాఖ్య బ్యాక్‌ఫైర్ అయింది. వర్ణవ్యవస్థలో అణిచివేతకుగురైన దళితల అభ్యున్నతి కోసం అంబేడ్కర్‌ పనిచేస్తే.. మోదీ మనుధర్మ వ్యవస్థకు చెందినవారని.. ఇద్దరిని పోల్చడానికి వీలులేదని డీఎంకే ఎంపీ టీకేఎస్‌ ఎలంగొవాన్‌ విమర్శించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి బీజేపీ సర్కార్‌ తీసుకొచ్చిన సంక్షేమపథకాలను దృష్టిలో ఉంచుకునే మోదీని ఇళయరాజా ప్రశంసించి ఉంటారని భావిస్తున్నట్టు బీజేపీ అధికారప్రతినిధి నారాయణన్‌ తిరుపతి అభిప్రాయపడ్డారు.