కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భోస్లే వివాహం ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఇటీవల ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని కేరళలోని ఒక ఆలయంలో ఆమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పెళ్లి చెల్లదని ఆమె కుటుంబ సభ్యులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. మోనాలిసా ఇంకా మైనర్ అని, ఆమె 2009లో జన్మించిందని ఆమె బాబాయ్ విజయ్ భోస్లే పేర్కొంటున్నారు. పాస్‌పోర్ట్ పత్రాల్లో వయసును తప్పుగా చూపించి మేజర్‌గా చిత్రీకరించారని, చట్ట ప్రకారం 18 ఏళ్లు నిండని కారణంగా ఈ వివాహం చెల్లదని వారు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండోర్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేసేందుకు ఆమె తల్లిదండ్రులు సిద్ధమవుతుండటం సంచలనం రేపుతోంది.
సర్టిఫికెట్‌తో సమాధానం – క్లారిటీ ఇచ్చిన వైరల్ గర్ల్
తన వయసు మరియు వివాహంపై వస్తున్న ఆరోపణలను మోనాలిసా తీవ్రంగా ఖండించారు. తన తండ్రి తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలని ఒత్తిడి తెస్తున్నారని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, పెద్దలను ఎదిరించి కేరళ రాజకీయ నాయకుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తన వివాహం చట్టబద్ధమేనని నిరూపించేందుకు కేరళ ప్రభుత్వం జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా తాను మేజర్ అని, చట్టప్రకారమే ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఈ వివాహ ధృవీకరణ పత్రం నెట్టింట వైరల్‌గా మారింది.
‘లవ్ జిహాద్’ ఆరోపణలు
మోనాలిసాను ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ వివాహంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమెకు శిక్షణ ఇచ్చి కెరీర్‌ను తీర్చిదిద్దిన తనను ఈ పరిణామాలు నిరాశకు గురిచేశాయని, ఇది ‘లవ్ జిహాద్’ అని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన ప్రకటించడం వివాదాన్ని మరింత రాజేసింది. అయితే, ఈ వ్యాఖ్యలను మోనాలిసా దంపతులు తోసిపుచ్చారు. తమకు అన్ని మతాలు సమానమని, ప్రేమతోనే తాము ఒక్కటయ్యామని వారు స్పష్టం చేశారు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే స్థాయి నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టే వరకు వచ్చిన మోనాలిసా జీవితం ఇప్పుడు ఈ వివాదంతో మలుపులు తిరుగుతోంది.
