అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప-2 (Pushpa 2)బెనిఫిట్ షో (Benefit Shows) సందర్భంగా హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ (Allu Arjun)ను ఏ11 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేయడం , నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడం , ఆ తర్వాత వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు రావడం చకచకా జరిగిపోయింది.
ఈ క్రమంలో బెనిఫిట్ షో లపై ఏపీ టీడీపీ నేత , ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి (MLA Bandaru Satyanarayana Murthy) విమర్శలు చేసారు. చిత్ర పరిశ్రమలో బెనిఫిట్ షోలు ఎవరి లాభం కోసం నిర్వహించబడుతున్నాయో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ బెనిఫిట్ షో లు నిర్మాతల కోసమా, డబ్బున్నవాళ్ల కోసమా? అని ప్రశ్నించారు. ప్రజా శ్రేయస్సు కోసం బెనిఫిట్ షోలు నిర్వహిస్తే తప్ప, వాటికి అనుమతి ఇవ్వకూడదు అని పేర్కొన్నారు.
బెనిఫిట్ షోల లక్ష్యం సమాజ శ్రేయస్సు కావాలనే ఉద్దేశంతోనే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాలు నిర్వహించారని బండారు గుర్తు చేశారు. వారి రోజుల్లో బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన ఆదాయం సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించబడిందని గుర్తు చేసారు. కానీ నేటి రోజుల్లో బెనిఫిట్ షోలను వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నదని బండారు విమర్శించారు. “ప్రొడ్యూసర్లకు ఎక్కువ లాభాలు అందించడానికే బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం సరైంది కాదు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బెనిఫిట్ షోలను పూర్తిగా రద్దు చేయాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం షో నిర్వహించే ఉద్దేశం లేకపోతే, బెనిఫిట్ షోల నిర్వహణను పూర్తిగా ఆపాల్సిందే అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also : Vinod Kambli : మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం విషమం