Oscar 2022: గ‌ల్లంతైన ఆశ‌లు.. జైభీమ్ మూవీకి ఆస్కార్ మిస్..!

  • Written By:
  • Updated On - February 9, 2022 / 02:14 PM IST

భారతీయ సినిమాకు మరోసారి ఆస్కార్ అవార్డుల్లో నిరాశే ఎదురైంది. సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్‌ అవార్డుల సంబరం మొద‌ల‌వ‌గా, ఈ ఏడాది వివిధ కేటగిరీల్లో పోటీపడే చిత్రాలు, నటులు, ఇత‌ర టెక్నీషియ‌న్లు వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది. అయితే ఈసారి కూడా భార‌తీయుల ఆస్కార్ ఆశ‌లు ఆవిరయ్యాయి. 94వ ఆస్కార్ అవార్డు రేసులో 276 చిత్రాలు పోటీ ప‌డ్డాయి.

భారత దేశం నుంచి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నంటించి జైభీమ్, మ‌ళ‌యాలం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన మ‌రక్కర్ చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఆస్కార్ ఫైన‌ల్ లిస్ట్ వ‌ర‌కు మాత్రం వెళ్ళ‌లేక పోయాయి. ఈ క్ర‌మంలో తాజాగా ప్రకటించిన విదేశీ చిత్రాల జాబితాలో ఈ రెండు చిత్రాలు చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే ఈసారి భారత్​ తరపున ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా రైటింగ్​ విత్​ ఫైర్ చిత్రం నామినేట్​ అయింది.

ఇక టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వం ద‌ర్శ‌క‌త్వంలో జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు, వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన జైభీమ్ మూవీకి విమర్శకుల ప్రశంసలు దక్కిన సంగ‌తి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోని చిత్రాలకు రేటింగ్స్ ఇచ్చే ఐఎండీబీలో హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కునెట్టి అత్యుత్తమ రేటింగ్ అందుకున్న జైభీమ్ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో జైభీమ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను పోస్టు చేయడంతో, జైభీమ్ చిత్రానికి ఆస్కార్ ఖాయ‌మ‌ని మేక‌ర్స్‌తో పాటు అంద‌రూ భావించారు. అయితే తాజాగా 2022వ సంవత్సరానికి విడుదలైన ఆస్కార్ నామినేషన్ల జాబితాలో జైభీమ్ చిత్రానికి చోటుదక్కలేదు. దీంతో ఇండియ‌న్ సినిమా ఆస్కార్ ఆశ‌లు మ‌రోసారి గ‌ల్లంత‌య్యాయి.