Site icon HashtagU Telugu

KTR with Bheemla Nayak: పవన్’ ను పొగడ్తలతో ఆకాశానికెత్తిన ‘కేటీఆర్’..!

Ktr Pawan Kalyan Imresizer

Ktr Pawan Kalyan Imresizer

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లూడుతూ.. “ఈ కార్యక్రమానికి నేను ఒక మంత్రి హోదాలో రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలిస్తే… ఆయన సోదరుడిగా వచ్చాను.

పవన్ కల్యాణ్ ఒక మంచి మనసున్న మనిషి. నా అభిప్రాయంలో సినిమా స్టార్లు, సూపర్ స్టార్లు చాలా మంది ఉంటారు.. కానీ ఒక విలక్షణమైన శైలి, ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన లాంటి విలక్షణమైన నటుడు అరుదు. నేను కూడా నా కాలేజీ రోజుల్లో ‘తొలిప్రేమ’ సినిమా చూశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే దాదాపు 26 ఏళ్ల వరకు ఆయనకున్న స్టార్‌డమ్ చెక్కుచెదరలేదు. ఇది ఒక అసాధారణమైన విషయం. ఇన్నేళ్ల పాటు ఇంతమంది అభిమానుల గుండెల్లో స్థానం సుస్థిరం చేసుకోవడం.. ఒక అసాధారణమైన విజయం. ఈ సినిమా కోసం పనిచేసిన దర్శకుడు సాగర్‌ తో పాటు టెక్నీషియన్లు అందరికీ నా తరుపున శుభాకాంక్షలు” తెలుపుతున్నాను అని అన్నారు కేటీఆర్.

అలాగే గత ఎనిమిదేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ నగరాన్ని ఒక సుస్థిరమైన కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ధృడసంకల్పంతో కృషి చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న ఈ కృషిలో పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు. గోదారిని భూదారి గా చూపించిన ఘనత తమ ప్రభుత్వానిదన్న కేటీఆర్… గోదావరి జలాలు ప్రవహించే కాళేశ్వరం ప్రాజెక్ట్.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌ల వద్ద కూడా షూటింగ్‌లు చేయవచ్చని సూచించారు.

కేటీఆర్ ఈ రకంగా పవన్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకరు ఫ్యూచర్ తెలంగాణ సీఎం అయితే… మరొకరు ఏపీ ఫ్యూచర్ సీఎం అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏ విధంగా ఆదుకుంటూ… ప్రోత్సహిస్తుందో అనేది చెప్పే ప్రయత్నం ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా జరిగింది. ఇంకా చెప్పాలంటే జగన్ సర్కార్ కు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కౌంటర్ ఇచ్చేందుకు ఈ వేడుక వేదికైనట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ బాగుంటే… అందులో పనిచేస్తే కార్మికులతో పాటు, పరోక్షంగా దానిపై ఆధారపడే వారు బాగుంటారు అనడంలో అతిశయోక్తి లేదు.

Exit mobile version