Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని తెలిసిందే. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఎంతో మంది అభిమానులకు చేయూతనిస్తారు.
తాజాగా చిరంజీవి ఓ అభిమాని కోరిక తీర్చారు. ఇటీవల మన తెలుగు అమ్మాయి దీప్తి జీవాంజి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించింది. వరంగల్ లోని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె ఒలంపిక్ లో మెడల్ సాధించి పేరు తెచ్చుకుంది. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించినప్పుడు ఆమెకు ఏం కావాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అడిగినప్పుడు ఆమె చిరంజీవి గారిని కలవాలనుందని తెలిపిందట.
దీంతో పుల్లెల గోపీచంద్ ఇటీవల చిరంజీవిని కలిసినప్పుడు దీప్తి జవాంజి గురించి చెప్పడంతో ఆయన స్పందించి.. ఆమె చాలా పెద్ద అచీవ్‌మెంట్ సాధించింది. ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని చెప్పారట. చిరంజీవి చెప్పినట్టే నిన్న పుల్లెల గోపీచంద్ అకాడమీకి వెళ్లి అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. రెండు గంటల పాటు అక్కడే గడిపారు. ప్రతీ ప్లేయర్‌తో మాట్లాడారు.
ఈ క్రమంలో దీప్తిని కూడా కలిశారు. అలాగే మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తికి అందించారు. అభిమాని కోరిక తీర్చడమే కాకుండా ఆమెకు ఆర్ధిక సహాయం కూడా అందించారని సంతోషం వ్యక్తం చేసారు పుల్లెల గోపీచంద్. దీంతో మరోసారి మెగాస్టార్ ని అభినందిస్తున్నారు.
Also Read : Manda Krishna Madiga : సినిమా దర్శకులతో మంద కృష్ణ మాదిగ భేటీ