ఒకప్పుడు దాసరి నారాయణరావు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నాడు. కులం, ప్రాంతం, చిన్నాపెద్దా భావన లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా వ్యవహరించాడు. అందుకే, టాలీవుడ్ అంతా ఆయన పక్షాన నిలిచింది. చిన్న సినిమాలు, నటులు, హీరోలు, నిర్మాతలను బతికించడానికి ఆయన ప్రయత్నించాడు. టిక్కెట్ల ఒకటే శ్లాబ్ ధరలను వ్యతిరేకించాడు. ప్రభుత్వాలు నిర్ణయించిన ధరకు మాత్రమే టిక్కెట్లను అమ్మాలని డిమాండ్ చేశాడు. ఆ మేరకు ప్రభుత్వాల మీద రాజీలేని పోరాటం చేశాడు. మీడియాలో కూడా అనే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఒకటే శ్లాబ్ తో తొలి వారం కలెక్షన్లను దండుకుంటూ వినోదరంగాన్ని సామాన్యులకు అందకుండా కొందరు హీరోలు చేస్తున్నారని పలు వేదికలపై ఆవేదన చెందాడు.టిక్కెట్ల ధరలను ప్రభుత్వాలు నియంత్రించాలని పోరాడిన చరిత్ర డాక్టర్ దాసరిది. ఒకానొక సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న షూటింగ్ ధరలపై కూడా ఆయన ఉద్యమించాడు. సినీ ఇండస్ట్రీని ఫిల్మ్ సిటీకి దూరంగా ఉంచడానికి ఆయన చేసిన ప్రయత్నాలు టాలీవుడ్ కు తెలుసు. అలాగే, టీవీ ఛానళ్లకు ఇచ్చే యాడ్స్ విషయంలో నిష్పాక్షింగా వ్యవహరించాలని గళం ఎత్తాడు. అలాంటి మహానుభావుని వారసునిగా సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి ఫోకస్ అవుతున్నాడు. అలా..అభిమానులు కోరుకుంటున్నారు. కానీ, ఆయన వైఖరి తద్బిన్నంగా ఉంది.
ఇటీవల దాసరి బాటలోనే తొలి అడుగులు చిరంజీవి వేశాడు. ఏపీ, తెలంగాణ సీఎంలను సహచర హీరోలతో కలిసి వెళ్లి భేటీ అయ్యాడు. సినిమా టిక్కెట్ల అంశంతో పాటు కార్మికులకు, స్టూడియోలకు భూములు ఇవ్వాలని కోరాడు. ఆ సందర్భంగా హీరో బాలక్రిష్ణ ఆయన వాలకంపై ఫైర్ అయ్యాడు. అన్నకు అండగా సోషల్ మీడియా వేదికగా నాగబాబు రంగంలోకి దిగాడు. బాలయ్యను టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టాడు. దీంతో సినీ పరిశ్రమలోని వర్గ విభేదాలు అభిమానులకు తెలిసిపోయాయి.ఏపీ సీఎం జగన్ ను కలిసిన సమయంలో టిక్కెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని, ఆన్ లైన్ పద్ధతిని అనుసరించాలని చిరు అండ్ టీం కోరింది. ఆ మేరకు రాతపూర్వక వినతిపత్రాన్ని కూడా ఆ టీం అందించింది. ప్రభుత్వం కూడా ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడి వరకు దాసరి బాటనే చిరంజీవి నడిచాడు. ఆ తరువాత తమ్ముడు పవన్ రూపంలో చిరుకు వ్యతిరేకత ప్రారంభం అయింది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాలపై ధ్వజమెత్తాడు. జగన్ తో సహా ప్రభుత్వంలోని మంత్రుల కులాలను బయటకు తీశాడు. అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. దీన్ని పవన్ వర్సెస్ జగన్ మధ్య రాజకీయ యుద్ధంగా జనసేన చిత్రీకరిస్తోంది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ధరలను అనూహ్యంగా పెంచింది. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది. దీంతో చిరంజీవి తెలంగాణ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. కానీ, ఏపీ ప్రభుత్వంతో మాత్రం సంప్రదింపులు జరపలేకపోయాడు. ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య వివాదం ముదరడంతో ఇప్పుడు చిరంజీవి రంగంలోకి దిగుతున్నాడు. త్వరలోనే సీఎం జగన్ ను మరోసారి కలవడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. దాసరి కోరుకున్న దానికి భిన్నంగా టిక్కెట్ల ధరల నియంత్రణకు వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. సో…సినీపరిశ్రమ ఒకప్పటి పెద్ద దిక్కు దాసరి తరహాలో చిరంజీవిని అందరివాడిగా బావించాలా? వద్దా? అనేది మీరే తేల్చుకోండి!