తన భర్త మరణంపై దయచేసి ఎలాంటి అసత్య ప్రచారం చేయొద్దని మీడియాకు నటి మీనా విజ్ఞప్తి చేశారు. భర్త దూరమయ్యాడనే బాధలో ఉన్న తన ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు. ఈమేరకు విజ్ఞాపనతో ఆమె సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత లేఖను విడుదల చేశారు. “నా భర్త ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసిన వైద్య బృందానికి , స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలు నిలవాలని ఎంతోమంది అభిమానులు ప్రార్థనలు చేశారు.
వారందరికీ ధన్యవాదాలు” అని లేఖలో పేర్కొన్నారు. మీనా భర్త విద్యా సాగర్ జూన్ 29న మరణించారు. మీనా వాళ్ళింటికి సమీపంలో పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని.. వాటి వ్యర్ధాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్లే విద్యా సాగర్ కు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయంటూ పలు తమిళ, ఇంగ్లీష్ మీడియాలలో కథనాలు వచ్చాయి. దీంతో మీనా పైవిధంగా స్పందించారు. అయితే అంతకుముందు విద్యా సాగర్ కొన్నాళ్ల పాటు కొవిడ్ తో బాధపడ్డారు. ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. ఎంతగా ప్రయత్నించినా దాతలు దొరకలేదని మీనా స్నేహితురాలు, కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఇటీవల కామెంట్ చేశారు.