Mass Jathara Trailer: మాస్ మహారాజా రవితేజ, యువ నటి శ్రీలీల నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara Trailer) విడుదలకు సిద్ధమైంది. ‘మనదే ఇదంతా’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు ముందుకు రానుంది.
ట్రైలర్‌లో రవితేజ మాస్ జాతర
ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం సోమవారం సాయంత్రం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. రవితేజ అభిమానులు ఆయన నుంచి ఆశించే కామెడీ, యాక్షన్, ఎనర్జీ ఈ ట్రైలర్‌లో మెండుగా ఉన్నాయి. ఇందులో రవితేజ అనే పవర్‌ఫుల్ రైల్వే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో రవితేజ తనదైన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు. రైల్వే వ్యవస్థలో జరిగే అక్రమాలను ఎదుర్కొనే నిజాయితీ గల అధికారిగా, మరోవైపు కడుపుబ్బా నవ్వించే హాస్య ప్రియుడిగా ఆయన పాత్రలో వైవిధ్యం కనిపిస్తోంది.
Also Read: Rohit- Virat: కోహ్లీ, రోహిత్‌లను భయపెట్టొద్దు.. బీసీసీఐకి మాజీ క్రికెటర్ విజ్ఞప్తి!
శ్రీలీల, నవీన్ చంద్ర ఆకర్షణ
ట్రైలర్‌లో శ్రీలీల గ్లామరస్‌గా, ఉత్సాహంగా కనిపించింది. ఆమె రవితేజతో కలిసి చేసిన డ్యాన్స్, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా శ్రీలీల మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నటుడు నవీన్ చంద్ర శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో రవితేజను ఢీకొట్టే సన్నివేశాలు ఉత్కంఠను పెంచాయి.
‘బలగం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మాస్ వైబ్‌ను జోడించింది. విధు అయ్యన్న కెమెరా పనితనం, భారీ యాక్షన్ సన్నివేశాలు నిర్మాణ విలువలను చాటిచెబుతున్నాయి. రవితేజ మార్కు వినోదానికి సరిపోయేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ‘మాస్ జాతర’ రాబోతోందని ట్రైలర్ స్పష్టం చేసింది.
గతంలో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు పండగలాంటి విందు భోజనం అందించడం ఖాయమనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ మరింత పెంచింది. అక్టోబర్ నెలను రవితేజ ‘మాస్ జాతర’తో ఘనంగా ముగించేందుకు సిద్ధమవుతున్నారు.
