Site icon HashtagU Telugu

NTR : ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ప్రభాస్ డైరెక్టర్

Maruthi Sorry

Maruthi Sorry

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసిన మారుతికి ఇది గోల్డెన్ ఛాన్స్ కావడంతో, ఈ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టి ప్రభాస్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి విడుదలైన ‘రెబల్ సాబ్’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ ఆదివారం బాలానగర్‌లోని విమల్ థియేటర్లలో జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అనవసరమైన వివాదాన్ని రాజేసి, రెబల్ స్టార్ ఫ్యాన్స్ మరియు యంగ్ టైగర్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాయి. మారుతి మాట్లాడుతూ..”ప్రభాస్ ఫోటో జేబులో పెట్టుకునే ఎవడైనా టాప్ డైరెక్టర్ అయిపోవచ్చని” చెప్పి, ఆపై ”రేపు పండక్కి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పను.. ఎందుకంటే ఈ కటౌట్ కి అవన్నీ చాలా చిన్న మాటలు అయిపోతాయి” అని అన్నారు.

మారుతి మాట్లాడిన ఈ ‘కాలర్ ఎగరేయడం’ అనే అంశంపైనే ఇప్పుడు వివాదం రేగింది. ఎందుకంటే, టాలీవుడ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఉద్దేశించి ప్రతీ ఈవెంట్‌లో కాలర్ ఎగరేయడం అనేది ఒక ట్రేడ్‌మార్క్‌గా మారింది. ‘దేవర’ సినిమా ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని గతంలో తారక్ చెప్పడం, ‘వార్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఏకంగా రెండు కాలర్లు పైకి ఎత్తి చూపించడం వంటి సంఘటనల కారణంగా ‘కాలర్’ అనగానే అందరికీ ఎన్టీఆరే గుర్తుకొస్తారు. అందుకే మారుతి చేసిన ‘కాలర్’ కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానులను ట్రిగ్గర్ చేశాయి. తమ హీరోను ఉద్దేశించే మారుతి ఆ వ్యాఖ్యలు చేశారంటూ, ప్రభాస్‌ను పొగిడే క్రమంలో ఎన్టీఆర్ కటౌట్‌ను తక్కువ చేసి మాట్లాడారని ఆరోపిస్తూ నెటిజన్లు మారుతిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో మారుతిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తూ, బూతులతో రెచ్చిపోవడంతో పాటు, పెద్ద హీరోతో సినిమా చేయగానే కొమ్ములొచ్చాయంటూ విమర్శించారు.

ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో డైరెక్టర్ మారుతి వెంటనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. “ఎవరినీ బాధపెట్టడం, అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదని” “స్టేజ్‌పై మాట్లాడే సమయంలో కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్న దానికి పూర్తి భిన్నంగా విషయాలు బయటకు వస్తాయని” ఆయన పేర్కొన్నారు. తాను మాట్లాడిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు చింతిస్తున్నానని, తనకు ఎన్టీఆర్ పట్ల, ఆయన అభిమానులందరి పట్ల అపారమైన గౌరవం ఉందని, తాను ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పూర్తి నిజాయితీతో వివరణ ఇచ్చారు. ఈ వివాదం, సినీ ప్రముఖులు స్టేజీల మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఆలోచించి మాట్లాడాలని మరోసారి స్పష్టం చేసింది. మారుతి వివరణతోనైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ శాంతిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version