Mansoor Ali – Trisha Issue: మన్సూర్ అలీఖాన్ వర్సెస్ త్రిష.. ఈ వివాదం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ట్రెండ్ అయింది. విజయ్ దళపతి హీరోగా ఇటీవల వచ్చిన లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ వస్తుందనుకున్నా కానీ.. రాకపోవడంతో అప్సెట్ అయ్యాయని మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. నెలన్నరరోజుల క్రితం జరిగిన ఈ వివాదం.. ఇప్పుడు మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది.
మన్సూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడగా.. ఆమెకు చిరంజీవి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ కూడా మద్దతిచ్చారు. తొలుత తన వ్యాఖ్యల్లో తప్పేం లేదన్న మన్సూర్.. చివరికి దిగొచ్చాడు. త్రిషకు సారీ చెప్పాడు. అంతటితో గొడవ సద్దుమణిగిందనుకున్నారు కానీ.. మన్సూర్ పరువునష్టం దావా వేసి మళ్లీ గొడవను రాజేశాడు.
త్రిషతోపాటు ఆమెకు మద్దతుగా మాట్లాడిన చిరంజీవి, ఖుష్బూలపై పరువునష్టం దావా వేశాడు. తనను అనరాని మాటలన్నారంటూ ఏకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురూ తనపై చేసిన వ్యాఖ్యలు తనను బాధపెట్టాయంటూ కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ పరువునష్టం దావా వేశాడు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం.. మన్సూర్ కు మొట్టికాయలు వేసింది.
గొడవల్లో తలదూర్చడం, ఏదొక విషయంపై వివాదం రేకెత్తించడం, మళ్లీ అమాయకుడిని అనడం పరిపాటిగా మారిందని ఆగ్రహించింది. పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో హీనమైన వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే మీపై కేసు పెట్టాలి.. ఇకనైనా సమాజంలో ఎలా మెలగాలో నేర్చుకో అంటూ మన్సూర్ ను తిట్టిపోసింది మద్రాస్ హైకోర్టు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలకు సంబంధించిన అన్ కట్ వీడియోను సమర్పించాలని అతని తరపు న్యాయవాదిని ఆదేశించగా తొలుత అంగీకరించారు. ఆ తర్వాత త్రిష అతనిపై చేసిన పోస్టులను కూడా తొలగించాలని కోరగా.. చిరంజీవి, ఖుష్బూ, త్రిషలు కూడా తమ వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు.