Ponniyin Selvan : పొన్నియిన్ సెల్వన్ మూవీని వెబ్ సిరీస్‌గా ఎందుకు తీయలేదో వెల్లడించిన మణిరత్నం..!!

మణిరత్నం అంటేనే ఒక స్పెషల్. ఆయన నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే...సినీఅభిమానులు ఎంతోఆత్రుతగా ఎదురుచూస్తారు.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 09:01 AM IST

మణిరత్నం అంటేనే ఒక స్పెషల్. ఆయన నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే…సినీఅభిమానులు ఎంతోఆత్రుతగా ఎదురుచూస్తారు. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు మణిరత్నం. ప్రస్తుతం ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కాగా గత కొన్నిరోజులుగా ఈమూవీ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను తెలుగులో కూడా ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 1954లో విడుదలైన కల్కి కృష్ణమూర్తి హిస్టారికల్ ఫిక్షన్ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఈ సినిమాపై చిత్రపరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పొన్నియిన్ సెల్వన్ నవల మొదట ఐదు భాగాలుగా విడుదలైంది. అయితే దర్శకుడు మణిరత్నం తన సినిమాటిక్ అనుసరణను రెండు భాగాలుగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ మూవీపై సినీ అభిమానులు, తమిళ సాహిత్యాభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నప్పటికీ, పొన్నియిన్ సెల్వన్‌ని వెబ్ సిరీస్‌గా తీయాల్సి ఉంటే బాగుండని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఈ మధ్యే త్రివేండ్రంలో జరిగిన ప్రెస్ మీట్‌లో, దర్శకుడు మణిరత్నం వెబ్ సిరీస్‌కు బదులుగా పొన్నియన్ సెల్వన్‌ని రెండు భాగాల సినిమాగా ఎందుకు ఎంచుకున్నాడో వెల్లడించాడు. “నేను పొన్నియిన్ సెల్వన్‌ని మొదటిసారి చదివినప్పుడు, ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నా అనిపించింది. ఆ నవల చదివినప్పుడు పెద్ద స్క్రీన్ చూస్తే బాగుండు అనిపించింది. – సాహసం, గుర్రాలు, యుద్ధం, స్త్రీలు, పురుషులు – ప్రతిదీ చాలా గ్రాఫిక్‌గా, చాలా పెద్దదిగా నచ్చింది. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. వెబ్ సిరీస్ అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. ”అని అన్నారు.

పొన్నియిన్ సెల్వన్‌ గా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కానుంది. రెండవ భాగం 2023 వేసవిలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది . పదవ శతాబ్దానికి చెందిన కథతో వస్తున్న ఈ మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష కృష్ణన్ ఇతరులు ఈ మూవీలో నటిస్తున్నారు. మణిరత్నం హోమ్ బ్యానర్ మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.