Manoj Vs Vishnu : ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు బిజినెస్ పార్ట్‌నర్ విజయ్ వెళ్లినట్లు సమాచారం. మనోజ్ ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజీకి సంబంధించి హార్డ్‌డిస్క్‌ను విజయ్ తన వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది. దీంతోపాటు మంచు మనోజ్ ఇంటి చుట్టూ మంచు విష్ణు ప్రైవేటు బౌన్సర్లు కాపలా కాస్తున్నట్లు తెలిసింది. దుబాయ్ నుంచి హుటాహుటిన వచ్చిన మంచు విష్ణు ఈరోజు మనోజ్ ఇంటికి వెళ్తారని అంటున్నారు. ఆస్తి తగాదాల్లో భాగంగా ఆదివారం ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తన భార్యతో కలిసి నడవలేని స్థితిలో మంచు మనోజ్(Manoj Vs Vishnu) బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరారు. ఆ సందర్భంగా ఆయనకు డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మనోజ్ నేరుగా జల్‌పల్లిలోని తన ఇంటికి వెళ్లారు.
Also Read :Bomb Threat : దేశ రాజధానిలో హైఅలర్ట్.. 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఆదివారం రోజు మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘మోహన్ బాబు తన అనుచరులతో నాపై దాడి చేయించారు. మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ నన్ను కొట్టాడు. మా నాన్న చెప్పడం వల్లే అతడు నాపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని ఆయన తెలిపారు.