Site icon HashtagU Telugu

Manchu Manoj: ముదురుతున్న మంచు వివాదం.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మ‌నోజ్‌

Manchu Manoj Apologies

Manchu Manoj Apologies

Manchu Manoj: టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ వివాదం క‌ల‌క‌లం రేపుతోంది. ఒక‌రి మీద ఒక‌రు ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్ప‌టికే మోహ‌న్ బాబు త‌న చిన్న కొడుకు మంచు మ‌నోజ్‌ (Manchu Manoj)పై రాచ‌కొండ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మంచు మ‌నోజ్ సైతం తెలుగు రాష్ట్రాల సీఎంలు త‌న‌కు సాయం చేయాల‌ని ట్వీట్ చేయ‌టంతో ఈ విష‌యం చాలా హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా మ‌నోజ్ సైతం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు: మనోజ్

మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్ తెలిపారు. తన కుటుంబం కోసం ఎనిమిదేళ్లు సినిమాల్లో కష్టపడ్డానని అన్నారు. ‘‘కొన్నాళ్లుగా ఇంటి నుంచి మా కుటుంబం దూరంగా ఉంటోంది. నా ముందే నా కుటుంబ సభ్యులను, ఉద్యోగులను తిట్టారు, కొట్టారు. విష్ణు అనుచరులే సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ బాధితులకు నేను అండగా ఉన్నాను. బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని మనోజ్‌ పేర్కొన్నారు.

Also Read: Vijay Devarakonda Pushpa 3 : పుష్ప 3లో విజయ్ దేవరకొండ ఉన్నాడా..?

విష్ణుకే మా నాన్న మద్దతు: మనోజ్

తన పరువుకు నష్టం జరిగిందని మంచు మనోజ్ తెలిపారు. ‘‘నా తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉంటారు. నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు. నేను 4నె లల కిందటే ఇంటికి వచ్చాననేది అవాస్తవం. నా ఫోన్ లొకేషన్ చూస్తే ఇది తెలుస్తుంది. ఈ గొడ‌వ‌ల్లోకి నా కూతుర్ని సైతం లాగ‌డం చాలా బాధ‌కరంగా ఉంది. నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడిందిలేదు. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నేను, నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం. విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్లాడో అంద‌రికీ తెలుసు’’ అని పేర్కొన్నారు.

తన తండ్రి మోహన్‌బాబు చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్‌ స్పందించారు. ‘‘నా పై, నా భార్య మౌనికపై మా నాన్న మోహన్‌‌బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన, తప్పుడు, నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా, నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిది’’ అని మనోజ్‌ ట్వీట్ చేశారు.