Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం టాలీవుడ్ ప్రాంతీయ చిత్రాల విభాగంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ ‘ఇండస్ట్రీ హిట్’గా అవతరించింది. చిరంజీవికున్న అశేష ప్రజాదరణ, దానికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రేక్షకుల మధ్య ఉన్న బ్రాండ్ వాల్యూ తోడవ్వడంతో ఈ చిత్రం అద్భుతమైన ప్రారంభాన్ని అందుకుంది.
సంక్రాంతి రేసులో ఇతర పెద్ద సినిమాల నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. పండగ సీజన్‌లో సినీ ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన ఈ చిత్రం సెలవుల తర్వాత కూడా పనిదినాల్లో తన పట్టును నిలబెట్టుకుంది. ప్రస్తుతం వచ్చిన లాంగ్ వీకెండ్‌ను కూడా అద్భుతంగా సొమ్ము చేసుకుంటూ వసూళ్ల జోరును కొనసాగిస్తోంది.
Also Read: ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన!
70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం విశేషం. దశాబ్దాల క్రితం ఆయన టాలీవుడ్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన స్వర్ణయుగాన్ని ఈ సినిమా వసూళ్లు గుర్తుకు తెస్తున్నాయి. గతంలో సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచినప్పటికీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆ విజయాన్ని మించిపోయి, ప్రస్తుతం ఉన్న అన్ని ప్రాంతీయ చిత్రాల రికార్డులను తుడిచిపెట్టేసింది.
ఈ భారీ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించారు. షైన్ స్క్రీన్స్- గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం సాధించిన అఖండ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం రేపు (ఆదివారం) భారీ స్థాయిలో ‘సక్సెస్ సెలబ్రేషన్స్’ నిర్వహించనుంది.
చిరంజీవి తన నటనతో, అనిల్ రావిపూడి తన మార్కు వినోదంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా మెగాస్టార్ చూపించిన ఎనర్జీ, డ్యాన్స్‌లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రాలలో ఇది అగ్రస్థానానికి చేరుకోవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
