Mamta Mohandas shares emotional dating story “He lied about his engagement” : టాలీవుడ్‌లో ‘యమదొంగ’, ‘హోమం’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన మమతా మోహన్ దాస్, కేవలం నటిగానే కాకుండా అద్భుతమైన గాయనిగా కూడా తనదైన ముద్ర వేశారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆమెకు క్యాన్సర్ సోకడం, దాన్ని ధైర్యంగా జయించి తిరిగి రావడం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల సుహాసిని మణిరత్నం నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న సమయంలో, కనీసం భావోద్వేగ పరంగానైనా ఒక తోడు ఉంటుందని ఆశించిన తనకు దారుణమైన మోసం ఎదురైందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. క్యాన్సర్ చికిత్స తర్వాత తానూ ఒక సాధారణ మహిళలా ప్రేమను, అనుబంధాలను అనుభవించాలని భావించారు. ఆ సమయంలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడు ఆమెను డేటింగ్‌కు ఆహ్వానించాడు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఆ బంధాన్ని కొనసాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. కానీ, తీరా కొంతకాలం గడిచాక అతనికి అప్పటికే మరొక మహిళతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసి మమత దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో తనకు అండగా ఉంటాడనుకున్న వ్యక్తి, ఇలా వెన్నుపోటు పొడవడంతో ఆమె మానసికంగా ఎంతో కుంగిపోయారు. ఆ తర్వాత మరో వ్యక్తితో పరిచయం ఏర్పడినా, అతను కేవలం కెరీర్‌కే ప్రాధాన్యత ఇచ్చి తనను వదిలేశాడని ఆమె చెప్పుకొచ్చారు.
కేవలం ప్రేమ వ్యవహారాలే కాకుండా, తన వైవాహిక జీవితం కూడా ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందని మమత ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్‌ను వివాహం చేసుకున్నప్పటికీ, కేవలం ఆరు నెలల్లోనే మనస్పర్థల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ఒకవైపు శరీరానికి సోకిన క్యాన్సర్, బొల్లి (Vitiligo) వంటి వ్యాధులు, మరోవైపు మనసును గాయపరిచిన విఫల ప్రేమలు మరియు విడాకులు.. ఇలా ఒకదాని వెంట ఒకటి ఎదురైన పరీక్షలను ఆమె ఒంటరిగానే ఎదుర్కొన్నారు. ఇన్ని కష్టాలు పడినా ఏనాడూ ధైర్యం కోల్పోకుండా, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతూ తనలాంటి బాధితులకు ఒక స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.
