Kandikonda: టాలీవుడ్ లో విషాదం.. కందికొండ క‌న్నుమూత‌!

ప్రముఖ గేయ రచయిత కందికొండ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

  • Written By:
  • Updated On - March 12, 2022 / 11:09 PM IST

ప్రముఖ గేయ రచయిత కందికొండ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. త్రోట్ క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజుల‌క్రితం ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది. అయితే రోజూ 70వేల రూపాయలకు పైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి వస్తుండటంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విష‌యం తెలిసి చాలామంది దాత‌లు ముందుకొచ్చి త‌మ‌వంతు సాయం చేశారు. అయినా కూడా ఆరోగ్యం మెరుగుప‌డ‌లేదు. క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతూ శ‌నివారం ఆయ‌న తుదిశ్వాస విడిచారు.

కందికొండ రాసిన పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయి. ఆయ‌న అనేక తెలుగు సినిమాల‌కు పాట‌లు రాశారు. కందికొండ సాహిత్య సేవ మరింత కాలం కొనసాగాలని, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని భావించారు. కానీ అర్ధాంత‌రంగా తుదిశ్వాస విడిచారు. పాట‌ల లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి. కందికొండను సినీ రంగానికి దివంగత సంగీత దర్శకుడు చక్రి పరిచయం చేశారు. కందికొండ రాసిన మళ్లీ కూయవే గువ్వా పాట.. ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

సీఎం కేసిఆర్ సంతాపం

ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ’ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ (యాదగిరి) మృతి కి సీఎం కేసిఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు.
పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ’ అని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. కందికొండ ను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించక పోవడం దురదృష్టమని సీఎం అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.