తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). చేసింది నాలుగు సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్నాడు. తన సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి, తనకి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండియన్ సినీ పరిశ్రమలో సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అతని సినిమాలపై మరింత ఆసక్తి పెంచేలా చేశాడు.
ప్రస్తుతం లోకేష్ విజయ్(Vijay)తో కలిసి లియో(Lio) సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా. ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్.. ఇలా అనేకమంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు. విజయ్ అభిమానులతో పాటలు లోకేష్ అభిమానులు కూడా లియో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఉంటుందని సమాచారం. తాజాగా లోకేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్నివ్యాఖ్యలు చేసి అందరికి షాక్ ఇచ్చాడు.
లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. నేను సినిమాలు చేయాలనుకున్నాను, అంతే. నాకు సుదీర్ఘ ప్రణాళికలు లేవు. ఇక్కడే సినీ పరిశ్రమలో శాశ్వతంగా ఉండాలని కూడా అనుకోవట్లేదు. ఓ పది సినిమాలు మంచివి చేస్తే చాలు అనుకున్నాను. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. అయితే ఆ పది సినిమాలు సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటాయా లేదా అనేది నా చేతిలో ఉండదు అని అన్నారు. దీంతో లోకేష్ అభిమానులతో పాటు సినీ పరిశ్రమ కూడా షాక్ అయింది. అభిమానులు అయితే లోకేష్ ని సినిమాలు తీయాలని, పరిశ్రమను వదలొద్దని అంటున్నారు. మరి లోకేష్ తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకుంటాడా లేదా చూడాలి.
ఇక లియో సినిమా గురించి లోకేష్ మాట్లాడుతూ.. పది రోజుల్లో విజయ్ సర్ పోర్షన్ పూర్తవుతుంది. విజయ్ అన్నతో మరోసారి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ను మిస్ అవుతాను. లియో సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమో కాదో తెలియాలంటే ఇంకో మూడు నెలలు ఆగాల్సిందే అని అన్నారు. ఇక లియో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.