లెజెండరీ గాయని, దక్షిణ భారత కోకిల ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఏకైక కుమారుడు మురళీ కృష్ణ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్తను ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర సోషల్ మీడియా వేదికగా ధృవీకరిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “మురళీ కృష్ణ గారి మరణ వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. జానకి అమ్మకు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ చిత్ర తన ఫేస్‌బుక్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో సంగీత ప్రపంచంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Janaki Chitra
మురళీ కృష్ణ కేవలం జానకి గారి కుమారుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న కళాకారుడు. శాస్త్రీయ నృత్యంపై ఉన్న మక్కువతో అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. కేవలం నృత్యానికే పరిమితం కాకుండా, సినిమా రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని దక్షిణాది సినిమాల్లో నటుడిగా కనిపించి మెప్పించారు. తన తల్లి సంగీత ప్రస్థానంలో ఆమెకు అండగా ఉంటూనే, తన సొంత కళా ప్రయాణాన్ని కొనసాగించారు.
మురళీ కృష్ణ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు. ఆయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వయసు మళ్లిన కాలంలో తనయుడిని కోల్పోవడం ఎస్. జానకి గారికి పెద్ద దెబ్బ అని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురళీ కృష్ణ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ నటీనటులు, గాయనీగాయకులు జానకి గారి నివాసానికి చేరుకుని ఆమెను పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు స్టార్ సెలబ్రిటీలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
