Asha Bhosle: గాన కోకిల, దిగ్గజ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోంస్లే గురించి ఒక ఆందోళనకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. 92 ఏళ్ల ఆశా భోంస్లేకు కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) రావడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆమె పరిస్థితిని గమనించిన వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (EMS) యూనిట్‌కు తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం ఆమెకు నిరంతరం చికిత్స అందిస్తోంది.
PTI కథనం ప్రకారం.. ఏప్రిల్ 11న కార్డియాక్ అరెస్ట్ సంభవించగానే ఆశా భోంస్లేను వెంటనే బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ప్రతీత్ సమదాని పర్యవేక్షణలో ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స జరుగుతోంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలపై కుటుంబ సభ్యుల నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వార్త తెలియగానే సంగీత ప్రపంచం, ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Also Read: US-Iran : అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన చర్చలు
మనుమరాలు జనాయ్ ప్రకటన
ఆశా భోంస్లే మనుమరాలు జనాయ్ భోంస్లే ఈ వార్తను ధృవీకరిస్తూ ఇలా పేర్కొన్నారు. మా నాయనమ్మ ఆశా భోంస్లే తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. మా ప్రైవసీని గౌరవించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. చికిత్స కొనసాగుతోంది. అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. త్వరలోనే మీకు సానుకూల అప్‌డేట్ ఇస్తామని చెప్పుకొచ్చింది.
అవార్డులు- గౌరవాలు
భారతీయ సంగీత రంగంలో ఒక ధ్రువతారగా వెలుగొందుతున్న ఆశా భోంస్లే తన 7 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వీటిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ విభూషణ్ వంటి గౌరవాలు ఉన్నాయి. ‘ఉమ్రావ్ జాన్’, ‘ఇజాజత్’ వంటి చిత్రాలకు ఆమె జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆమె తన 93వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రస్తుతం కోట్ల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులు ఆశా భోంస్లే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
