మలయాళ నటుడు బాలా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా వరుస వివాదాలతో ఆయన పేరు సోషల్ మీడియాలో నానుతూనే ఉంటుంది. అయితే గతంలో అతడి రెండో భార్య ఆరోపణలు, ఫిర్యాదుల వల్ల పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల మూడో భార్య తనపై సంచలన ఆరోపణలు చేయగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు బాలా గత ఏడాది తన చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే వీరి వైవాహిక బంధం నూరేళ్ల పాటు కొనసాగాలని కోరుతూ, ఎవరి దిష్టి తగలకూడదని కోకిల తల్లి తిరుమలలో గుండు కొట్టించుకుంది. మీ జంటను చూసి చాలామంది కుళ్లుకుంటున్నారు. అందరి కళ్లు మీ పైనే ఉన్నాయి. అందుకే ఎవరి దిష్టి తగలకుండా మీ దాంపత్యజీవితం సాఫీగా సాగాలని భగవంతుడిని కోరుకుంటూ తలనీలాలు సమర్పించుకున్నాను అని కోకిల తల్లి చెప్పుకొచ్చింది. కోకిల నానమ్మ అయితే దంపతులను ఆశీర్వదిస్తూ వచ్చే ఏడాది బిడ్డను ఎత్తుకుని రావాలని కోరిందట. వీరిద్దరూ బాలాకు ఉంగరం, కోకిలకు ముక్కు పుడకను బహుమతిగా ఇచ్చారట.
అందుకు సంబంధించిన వీడియోను బాలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ బాలాను విమర్శిస్తున్నారు. నువ్వు ఏం చేసినా సరే ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ నీకు మోక్షం లభించదు. ఈ ప్రపంచంలో సొంత బిడ్డను మోసం చేసిన ఏకైక తండ్రివి నువ్వే ముగ్గురు స్త్రీల కన్నీళ్లకు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. దీనికి బాలా స్పందిస్తూ.. నాపై నెగెటివ్ కామెంట్లు చేసే మిత్రులారా.. నేను పెట్టే వీడియోలు చూస్తుంటే మీకెంత కోపం వస్తుందో నాకు తెలుసు. కాబట్టి నా అకౌంట్ ను మీరు అన్‌ఫాలో అయితే సరిపోతుంది. అలా చేయలేకపోతున్నారంటే నా వీడియోలకు మీరు బానిసైపోయారని అర్థం. అయినా నేనెవర్నీ మోసం చేయలేదు అంటూ తన ఫేస్‌బుక్ లో రాసుకొచ్చాడు.