KGF Chapter2 Review: బాక్సాఫీస్‌‌ కా బాప్.. ‘కేజీఎఫ్-2’

పెను నిశబ్ధం తర్వాత మహా విస్పోటనం జరుగుతోంది.

  • Written By:
  • Updated On - April 14, 2022 / 04:25 PM IST

రివ్యూ: కేజీయఫ్‌ – ఛాప్టర్‌ 2
రేటింగ్‌: 3/5
తారాగణం: యష్‌, శ్రీనిధి, రవీనా టాండన్, సంజ‌య్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్‌
నిర్మాత: విజయ్‌ కిరగందూర్‌
రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022

పెను నిశబ్ధం తర్వాత మహా విస్పోటనం జరుగుతోంది. కేజీఎఫ్ ఛాప్టర్- 1… ఇండియన్ బాక్సాఫీస్‌‌ను ఓ డైనమైట్ పెట్టి పెల్చినంత పనిచేస్తే… కేజీఎఫ్ ఛాప్టర్ -2 అదే బాక్సాఫీస్‌ను 1000 డైనమైట్లు పెట్టి పేల్చినంత మహా విస్పోటనాన్ని సృష్టించింది. కన్నడ ఇండస్ట్రీ ఒకటి ఉందని.. అక్కడి నుంచి వచ్చే ఓ సినిమా దేశాన్ని తనవైపు తిప్పుకునేలా చేస్తుందని అసలు కలలో కూడా ఎవ్వరూ అనకోని సమయంలో వచ్చింది కేజీఎఫ్.

సినిమా మొత్తం రాఖీభాయ్, ప్రశాంత్ నీల్ మాత్రమే కనిపిస్తారు. హీరో అన్న పదానికి యశ్ సరికొత్త రూపంగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు. రాకీభాయ్ పాత్రను ఆస్థాయిలో మలచడంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. సినిమా మొత్తంలో రాఖీభాయ్ లేని ఫ్రేమ్‌లు ఎన్నిఉన్నాయో లెక్కపెట్టేంతలా కథ సాగిందంటే… హీరోను ప్రశాంత్ నీల్ ఏ రేంజ్‌లో చూపించాడో మీ ఊహలకే వదిలేస్తున్నా. రాఖీ ఫ్రేమ్‌లో కనిపించిన ప్రతీసారి వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్ గోడలు బద్దలవుతాయా..? అన్న ఫీలింగ్ కలిగిస్తోంది. రాఖీ కనిపించిన ప్రతీసారి హీరో ఇంట్రడక్షన్ సీనే అనేంతలా సాగింది సినిమా. రవి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలెట్. హీరోయిన్ శ్రీనిధి పాత్రకు ఛాప్టర్-1లో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా… ఛాప్టర్ -2 లో ఆకట్టుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రవీనా, ఈశ్వరీ రావు ఇలా అన్ని పాత్రలు కథలో ప్రాధాన్యమున్న పాత్రలే కావడం సినిమాకు చాలా ప్లస్ అయింది. క్లైమాక్స్ సీన్ అయిపోయే వరకు ప్రేక్షకులు సీట్ల నుంచి లేవడానికి ఇష్టపడరంటే కథనం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

2.O,బాహుబలి, కేజీఎఫ్, RRR,వంటి సినిమాలను ఇండియన్ ఆడియన్స్ రుచి చూడటం ప్రారంభమైంది. దీని పరిణామాలు బాక్సాఫీసుపై పెను ప్రభావాన్ని చూపుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కథాబలం ఉన్న ఓ పెద్ద కథ, కథనం, భారీ నిర్మాణ విలువలు అన్నింటిని మించి ప్రేక్షకుల అంచనాలు… వీటన్నింటినీ అందుకోవాలంటే దర్శకులు ఆకాశమే హద్దుగా కథలు రాయాలి. అంచనాలను మించిన కథలను ఎన్నుకోవాలి. ఊహలకందని కథనంతో ప్రేక్షకులను మెప్పించాలి. అప్పుడే ఓ దాన్ని మించి మరో సినిమా వస్తోంది. ప్రేక్షకుల ఆకలి తీరుతుంది. సౌత్ సినిమాలు ఇండియాలోనే కాదు… వరల్డ్ వైడ్‌గా రీసౌండ్ రావడం ప్రారంభమైంది. దీని తాలుకు ఇంపాక్ట్ ఇప్పటికే బాలీవుడ్‌పై పడింది. భవిష్యత్తు సైతం ఇలానే సాగితే ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా.. అన్నంతలా పరిస్థితి మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

రివ్యూ బై : సంకీర్తన్. జీ