Karate Kalyani : కరాటే కళ్యాణికి షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. ‘మా’ సభ్యత్వం రద్దు.. న్యాయపోరాటం చేస్తాను అంటూ..

కొన్ని రోజుల క్రితం కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోండి కానీ మా దేవుడు కృష్ణుడి రూపంలో పెట్టొద్దు. విగ్రహం మార్చకపోతే కోర్టు వరకు వెళ్తాను అంటూ హడావిడి చేసింది.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 10:00 PM IST

నటి కరాటే కళ్యాణి(Karate Kalyani) అప్పుడప్పుడు సడెన్ గా బయటకి వచ్చి ఏదో ఒక విషయంపై హడావిడి చేస్తుంది. గత కొన్నాళ్లుగా ఇది సాగుతూనే ఉంది. తాజాగా ఎన్టీఆర్(NTR) విగ్రహంపై వివాదం సృష్టిస్తుంది కరాటే కళ్యాణి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా మే 28న ఆయన శత జయంతి రోజు ఖమ్మం(Khammam)లో కృష్ణుడి రూపంలో ఉన్న 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుండగా జూనియర్ ఎన్టీఆర్ ని ఈ విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు.

అయితే కొన్ని రోజుల క్రితం కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోండి కానీ మా దేవుడు కృష్ణుడి రూపంలో పెట్టొద్దు. విగ్రహం మార్చకపోతే కోర్టు వరకు వెళ్తాను అంటూ హడావిడి చేసింది. ఈ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ అయి కరాటే కల్యాణికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయినా కళ్యాణి లెక్కచేయకుండా కోర్టులో విగ్రహావిష్కరణ ఆపాలంటూ పిటిషన్ వేసింది. దీంతో తాజాగా మా ప్రసిడెంట్ మంచు విష్ణు కళ్యాణికి షాక్ ఇచ్చాడు.

కరాటే కళ్యాణి మా సభ్యత్వంను రద్దు చేస్తున్నట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి లేఖను విడుదల చేశారు. అయితే దీనిపై కరాటే కళ్యాణి మీడియా ముందుకి వచ్చి స్పందిస్తూ.. ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడినందుకే నన్ను మా అసోసియేషన్ నుండి సస్పెండ్ చేశారు. నన్ను సస్పెండ్ చేయడం పట్ల న్యాయపోరాటం చేస్తాను. నేను ఎన్టీఆర్ కి వీరాభిమానిని, కానీ శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. నాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మా అసోసియేషన్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చాను. నేను వేసిన పిటిషన్ కు మా అసోసియేషన్ కు ఎలాంటి సంబంధం లేదు. శ్రీకృష్ణుడిపై అభిమానంతోనే పిటీషన్ వేశాను అని తెలిపింది. మరి 28వ తేదీన ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందా, జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా? కోర్టు ఈ విషయంలో ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.

 

Also Read : Dimple Hayathi : పార్కింగ్ వివాదం అనంతరం డింపుల్ కి ప్రాణహాని.. అనుమానిత కాల్స్.. డింపుల్ ఇంటికి అనుమానిత వ్యక్తులు..