Balayya: బాలయ్యకు కాపునాడు అల్టిమేటం.. అలా చెయ్యకపోతే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామంటూ?

తెలుగు సినీ దిగ్గజాలు గురించి వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.

  • Written By:
  • Updated On - January 25, 2023 / 11:16 AM IST

Balayya: తెలుగు సినీ దిగ్గజాలు గురించి వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. బాలయ్య మాట్లాడుతూ.. ఆ రంగారావు ఈ రంగారావు… అక్కినేని తొక్కినేని… అంటూ వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలుగు దిగ్గజాలు అయిన ఎస్వీఆర్, ఏఎన్నార్ లను ఎంతో చులకనగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేనిపై బాలకృష్ణ వ్యాఖ్యలకు ఇప్పటికే నాగచైతన్య, అఖిల్ కౌంటర్ ఇచ్చారు. అంత పెద్ద నటులను కించపర్చడం అంటే మనలని మనమే కించపర్చుకోడం అంటూ తెలిపారు. మరోవైపు ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యల పట్ల కాపునాడు మండిపడుతోంది. బాలయ్య వ్యాఖ్యలు కాపుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 25 లోపు మీడియా ఎదుటకు వచ్చి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది.

బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటామని కాపునాడు హెచ్చరించింది. అంతే కాకుండా బాలకృష్ణను పార్టీ నుంచి టీడీపీ పదేళ్లపాటు బహిష్కరించాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాల వద్ద కాపులందరూ మౌన ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇంతకుముందు కూడా చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యారని, రాజకీయాలు తమకే సాధ్యమని మా బ్లడ్, మా బ్రీడ్ వేరు అని వ్యాఖ్యానించారని.. అలాగే జనసేన పార్టీలో ఉండేవాళ్లు అలగాజనం, సంకరజాతి అన్న మాటలు కాపులను ఎంతో గాయపరిచాయని కాపునాడు నేతలు అంటున్నారు.

ఓ వైపు టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనీ భావిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బాలయ్య రంగారావు గురించి తప్పుగా మాట్లాడటం, ఆ వ్యాఖ్యలపై కాపు నాయకులు మండిపడటం.. ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. మరి బాలయ్య క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.