Site icon HashtagU Telugu

Kannadiga Actresses: తెలుగు తెరపై ‘కన్నడ’ ముద్దుగుమ్మల జోరు!

Kannada

Kannada

ఇటీవలి కాలంలో సూపర్‌హిట్ అయిన తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్స్ అంతా కర్ణాటకకు చెందినవాళ్లే కావడం విశేషం. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం ‘పుష్ప’ సినిమాతో రష్మిక మందన్న పాన్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. ఇక లెటెస్ట్ హిట్ ‘డీజే టిల్లు’ స్టార్ నేహా శెట్టి కూడా బెంగళూరుకు చెందింది. అయితే వీళ్లందరి కంటే ముందే మంగళూరుకు చెందిన మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుష్క శెట్టి టాలీవుడ్ కు బాటలు వేసింది.

పూజా హెగ్డే

పూజా హెగ్డే చాలా మంది తెలుగు చిత్రనిర్మాతలకు బెస్ట్ ఛాయిస్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ఆకట్టుకుంటోంది. ఇతర హీరోయిన్స్ కంటే ఈ బ్యూటీకి ఎక్కువ డిమాండ్ ఉంది. పూజా ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి, ‘అల వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి సూపర్‌హిట్ తెలుగు చిత్రాలతో ఆకట్టుకుంది. పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. కర్నాటకలోని ఉడిపికి చెందిన తులు మాట్లాడే కుటుంబానికి చెందిన పూజా చిరంజీవి-రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ కూడా ఆకట్టుబోతోంది.

రష్మిక మందన్న

‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’ అయిన రష్మిక మందన్న తెలుగు చిత్ర పరిశ్రమకు ముద్దుగుమ్మ అన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన ‘గీత గోవిందం’లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ ‘పుష్ప: ది రైజ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది. శర్వానంద్‌తో రష్మిక నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. నటి ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్ లో పాల్గొనబోతోంది. రష్మిక కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట పట్టణంలో జన్మించింది.

కృతిశెట్టి

కృతి శెట్టికి కేవలం 18 ఏళ్లు ఉండవచ్చు. కానీ ఈ నటి పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి నటించిన ‘ఉప్పెన’, అక్కినేని నాగార్జున, నాగ చైతన్యతో ‘బంగార్రాజు’ వంటి హిట్ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేస్తోంది. నాని, సాయి పల్లవి నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలో ఈ బ్యూటీ మెరిసింది. మంగళూరుకు చెందిన ఈ చిన్నది సుధీర్ బాబు సరసన రాబోయే చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ , రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’లో నటించబోతోంది.

నేహా శెట్టి

మంగళూరులో జన్మించిన నేహా శెట్టి 2014లో ‘మిస్ మంగళూరు’ టైటిల్‌ను గెలుచుకుంది. 2015 మిస్ సౌత్-ఇండియా పోటీలో మొదటి రన్నరప్‌గా కూడా నిలిచింది. ఇటీవలే సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ‘డీజే టిల్లు’లో తన నటనతో ఆకట్టుకుంది. 2022లో తొలి విజయవంతమైన తెలుగు చిత్రంగా ‘డీజే టిల్లు’ నిలిచింది.