Site icon HashtagU Telugu

Aamir Khan vs Kangana: అమీర్ ఖాన్ పై కంగన ట్రోల్స్‌

Aamir Khan Kangana

Amir Kangana

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut). తన పేరు ప్రస్తావించడానికి కూడా ఆమిర్‌ ఇష్టపడలేదని విమర్శించారు. ఉన్నట్టుండి కంగన.. ఆమిర్‌ఖాన్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారంటే..

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) పరాజయం తర్వాత మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు ఆమిర్‌ ఖాన్ (Aamir Khan)‌. తాజాగా ఆయన రచయిత శోభా డే రచించిన ఓ పుస్తకం విడుదల కార్యక్రమంలో పాల్గొని మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ విలేకరి‌.. ‘‘ఒకవేళ శోభా డే మీద బయోపిక్‌ తీస్తే ఆమె పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది’’ అని ప్రశ్నించాడు. ‘‘ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అలియాభట్‌.. వీళ్లు గొప్ప నటీమణులు. నాకు ఈ ముగ్గురే గుర్తుకు వస్తున్నారు. వేరే ఎవరి పేరు తట్టడం లేదు’’ అని ఆమిర్‌ బదులిచ్చారు. దీంతో పక్కనే ఉన్న శోభా డే కంగన పేరు చెప్పగా.. ‘‘అవును. కంగన కూడా మంచి నటీమణి’’ అని ఆయన మెచ్చుకున్నారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రాగా.. తాజాగా కంగన ట్వీట్‌ చేశారు. ‘‘అయ్యో పాపం ఆమిర్‌.. నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండటానికి ఎంతో శ్రమించాడు. కాకపోతే అది సాధ్యం కాలేదు. నా పేరును ప్రస్తావించినందుకు థ్యాంక్యూ శోభా. మా ఇద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ, నా కళ, శ్రమను ప్రశంసించడంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇది అద్దం పడుతుంది’’ అని తెలిపారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆమిర్‌ మిమ్మల్ని ప్రశంసించినప్పటికీ ఆయన్ని విమర్శించడం ఎంతవరకూ సమంజసం?’’, ‘‘మీరు గొప్ప అని చెప్పడం కోసం మిగతా నటీమణులపై బురద జల్లడం సరైన పద్ధతి కాదు’’ అని కామెంట్లు చేస్తున్నారు.

Also Read:  Rat in a Bread: బ్లింకిట్ లో బ్రెడ్ ఆర్డర్.. బ్రెడ్ ప్యాకెట్ లో ఎలుక