అంతన్నారు.. ఇంతన్నారు. తీరా చూస్తే.. ఎంతా లేదు. ఇది.. బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనారనౌత్ నటించిన ధాకడ్ సినిమా పరిస్థితి. ఈ సినిమా మే 20న దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. సినిమా ట్రైలర్, టీజర్ లను చూసి.. ఓహో ఇది కలెక్షన్లను అదరగొడుతుంది అని అంతా అనుకున్నారు. దీంతో కంగనా రనౌత్ దశ తిరిగినట్టే అని భావించారు. తీరా కలెక్షన్లను చూస్తే దారుణంగా ఉన్నాయి.
ఈ సినిమా విడుదలైన రోజు నుంచే కలెక్షన్లు పడిపోయాయి. సరే.. రెండోవారంలో అయినా పుంజుకుంటుందా అని ఎదురుచూశారు. అయినా వసూళ్లు రాలేదు. మే 27న శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ఈ సినిమాకు అమ్ముడుపోయిన టిక్కెట్లు ఎన్నో తెలుసా? కేవలం 20 టిక్కెట్లు. దానికి వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా? జస్ట్.. రూ.4,420 మాత్రమే. దీంతో చిత్ర నిర్మాతకు ఏం చేయాలో కూడా పాలుపోలేదు.
ధాకడ్ సినిమా కోసం నిర్మాత భారీగా ఖర్చుపెట్టడంతో బడ్జెట్ కాస్తా రూ.90 కోట్లు అయ్యింది. సరే ఇప్పటివరకు ఇది సాధించిన వసూళ్లు ఎంత అని చూస్తే.. దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఓవరాల్ గా చూస్తే.. ఈ సినిమా కు రూ.85 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని స్పష్టంగా తెలుస్తోంది. బాలీవుడ్ లో అత్యంత దారుణమైన కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల జాబితాలోకి ఇది కూడా చేరింది.
థియేటర్లలో నష్టం వస్తే వచ్చింది.. కనీసం ఓటీటీ నుంచైనా పెట్టుబడిని రాబట్టుకుందాంలే అని ప్రయత్నిస్తే.. అదీ వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఈ సినిమాను కొనడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా ముందుకు రావడం లేదు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కంగనా సినిమా ఇలా అవ్వడంతో హిందీ చిత్రసీమే ఆశ్చర్యపోయింది.