Site icon HashtagU Telugu

Kamal And Rajini: రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిసిన కమలహాసన్.. ‘విక్రమ్’ కోసమేనా?

Rajinikanth And Kamal Haasan

Rajinikanth And Kamal Haasan

తమిళ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటివారు రజనీకాంత్, కమలహాసన్. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే దగ్గర కూల్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ కు మాత్రం అది పండగే. కమలహాసన్ నటించిన సినిమా విక్రమ్.. జూనో మూడో తేదీన విడుదల కానుంది. ఆ సందర్భంగా.. లోకనాయకుడు మర్యాదపూర్వకంగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి సూపర్ స్టార్ ను కలిశారు. కానీ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికీ దానిని చూసి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

రజనీకాంత్ ఎప్పటిలాగే తెల్లటి కుర్తా, లుంగీలో దర్శనమివ్వగా, కమలహాసన్ మాత్రం బ్లాక్ నెక్ టీషర్ట్, బ్లూ డెనిమ్ వేసుకున్నారు. కమలహాసన్ తోపాటు విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా రజనీకాంత్ ను కలుసుకున్నారు. ఆయనే ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు తమిళనాడులో బాగా వైరలైంది. డైరెక్టర్ లోకేష్ ఇద్దరు హీరోలకు థ్యాంక్స్ చెబుతూనే.. ఇద్దరి స్నేహాన్ని ప్రశంసించాడు. ఇద్దరూ స్ఫూర్తినిస్తారని.. రాసుకొచ్చాడు.

విక్రమ్ ట్రైలర్ ను ఈమధ్యే రిలీజ్ చేసింది మూవీ టీమ్. అందులో ఫ్యాన్స్ ను బాగా అలరించేలా హైఓల్టేజ్ తో ఉన్న యాక్షన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయంటున్నారు కమల్ ఫ్యాన్స్. దీనికి సంబంధించి అత్యుత్తమ ట్యూన్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించారన్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ సినిమాకు కెమెరామెన్ గిరీష్ గంగాధరన్. యాక్షన్ సీన్స్ అన్నీ అన్బుమణి, అరివుమణి ఆధ్వర్యంలో చిత్రీకరించారు.

సినిమా ప్రమోషన్ కోసమే రజనీకాంత్ ను కమలహాసన్ కలిసినా.. మొత్తానికి ఈ విధంగా అయినా సరే వీరిద్దరూ కలవడమే చాలు చాలు అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రజనీకాంత్ ఎక్కువగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ప్రముఖులంతా ఆయనను కలవడానికి వీలవుతోంది. ఆమధ్య మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కూడా రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిశారు. తరువాత రజనీకాంత్ కూడా ఇళయరాజాతోపాటు ఆయన స్టూడియోకు వెళ్లి కాసేపు గడిపారు.