Site icon HashtagU Telugu

ఫ్యాషన్ ప్రపంచంలోకి విలక్షణ నటుడు కమల్..

కమల్ హాసన్ జాతీయంగా విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. సినిమాలతో పాటు చాలా వ్యాపారాల్లో ఇప్పటికే అడుగుపెట్టిన కమల్ హాసన్..కొద్దికాలంగా రాజకీయాల్లో బిజీగా గడిపాడు. సొంతంగా పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యాడు. ఇప్పుడు తిరిగి మరో బిజినెస్ ప్రారంభించబోతున్నాడు. ఈసారి ఫ్యాషన్ ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నాడు. సరికొత్త బ్రాండ్‌ ను ఆవిష్కరించబోతున్నాడు.

హౌస్ ఆఫ్ ఖద్దర్ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను కమల్ హాసన్ లాంచ్ చేయనున్నాడు. ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడమే కాకుండా యువతను ఖాదీకు చేరువ చేసేందుకు , నేత కార్మికులకు చేయూత అందించేందుకు హౌస్ ఆఫ్ ఖద్దర్ బ్రాండ్ లాంచ్ చేయనున్నాడు. దేశానికి ఖాదీ ఓ గర్వ కారణమని..వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందని కమల్ హాసన్ చెప్పారు. చలికాలంలో ఉండే అసౌకర్యాన్ని, వేసవి కాలంలో ఉండే వేడి నుంచి మనకు ఉపశమనం ఇస్తుంది. యువతకు ఖాదీని మరింత చేరువ చేయాలని, చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నది తన ఆలోచన అని కమల్ హాసన్ చెప్పారు.

కమల్‌ హాసన్‌ పుట్టినరోజునే చికాగోలో ఆవిష్కరణ..
కమల్‌ హాసన్‌ పుట్టిన రోజైన నవంబరు 7 న ‘హౌస్‌ ఆఫ్‌ ఖద్దర్‌’ ఆవిష్కరణ ఉంటుందని వినిపిస్తోంది. కమల్‌ హాసన్‌ ఆయన కుమార్తె శృతిహాసన్‌లకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అమృతా రామ్‌ ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్‌ బ్రాండ్‌ దుస్తుల డిజైనింగ్‌ జరుగుతోందని సమాచారం. వచ్చే నెల కమల్‌ అమెరికా వెళ్లాలనుకుంటున్నారట. అక్కడి చికాగో నగరంలో తన బ్రాండ్‌ని ఆవిష్కరించాలనుకుంటున్నట్లు సమాచారం.

 

చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నదే నా ఆలోచన : కమల్‌హాసన్‌
చలికాలంలో ఉండే అసౌకర్యాన్ని తొలగిస్తూ, వేసవి కాలంలో ఉండే వేడి నుంచి ఉపశమనమిచ్చేది ఖాదీ అన్నారు. ప్రపంచ యువతకు ఖాదీని మరింత చేరువ చేయాలని, చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నది తన ఆలోచన అని కమల్‌హాసన్‌ చెప్పారు. దీంతో బలమైన భారతీయ గుర్తింపునిచ్చే ఈ ఖాదీని ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్‌ రంగానికి సరికొత్త ఆలోచనలతో అందించబోతున్నారు. భారతీయ చేతి వృత్తితో నేసిన ఈ ఖాదీ దుస్తులు అందంతోపాటు ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయి. దీనివల్ల ప్రపంచ యువతకు ఖాదీని దగ్గర చేస్తుందని కమల్ అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version