Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర విలన్ రోల్ అని తెలుస్తుంది. అయితే ఈ పాత్ర సినిమాలో ఎక్కువ సమయం కనిపించదని, మూవీ చివరిలో మాత్రమే వస్తుందని.. కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ కమల్ హాసన్ మూవీలో ఎంత సమయం కనిపించబోతున్నారో తెలుసా..?
ఈ సినిమా ఒక భాగంగా కాకుండా.. పలు భాగాలుగా వస్తుందనే వార్తలు వింటూనే ఉన్నాము. ఈక్రమంలోనే ఈ మూవీ మొత్తం ఐదు భాగాలుగా రాబోతుందట. మొదటి భాగం చివరిలో కమల్ హాసన్ ఎంట్రీ ఉండబోతుందట. ఈ పాత్ర ఎంట్రీతో సినిమా కథ మరో మలుపు తిరుగుతుందట. ఇక ఈ పాత్ర స్క్రీన్ ప్రెజెన్స్ దాదాపు 20 నిముషాలు పాటు ఉందట. ఇక సెకండ్ పార్ట్ లో అయితే దాదాపు గంటన్నర సమయం కమల్ హాసన్ కనిపించనున్నారట. ఇక ఈ సినిమా కోసం కమల్ హాసన్ అక్షరాలా రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకున్నట్లు సమాచారం.
కాగా హిందూ పురాణ కథలు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్.. విష్ణుమూర్తి ‘కల్కి’ అవతారంలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్ ఏమో సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామ’ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో కమల్ హాసన్ ఎటువంటి పాత్రలో కనిపించబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకుంది. కాగా ఈ మూవీని జూన్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా రిలీజైన రెండు వారాలకు.. కమల్ హాసన్ మళ్ళీ ఇండియన్ 2తో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు.