Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాని చేస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఒకప్పటి లేడీ మెగాస్టార్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం #NKR21 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ కోసం కొన్ని టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట.
వాటిలో ఒకటి రామ్ చరణ్ టైటిల్ కూడా కనిపిస్తుంది. మగధీర వంటి బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ అండ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన సినిమా ‘మెరుపు’. ధరణి దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం.. ఆదిలోనే ఆగిపోయింది. దీంతో మెరుపు అనే పవర్‌ఫుల్ టైటిల్ కూడా వృధా అయ్యిపోయింది. ఇక ఇప్పుడు ఆ పవర్‌ఫుల్ టైటిల్ ని కళ్యాణ్ రామ్ తీసుకుంటున్నారట. ఈ మూవీలోని కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలు చాలా పవర్‌ఫుల్ గా కనిపిస్తాయట. అలాంటి పాత్రలకు మెరుపు టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి అదే టైటిల్ ని ఖరారు చేస్తారా, లేదా..? అనేది చూడాలి.
ఇక ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ తన సూపర్ హిట్ మూవీ ‘బింబిసారా’కి కొనసాగింపుని తీసుకు రాబోతున్నారు. అయితే అది సీక్వెల్ గా కాకుండా, ప్రీక్వెల్ గా తీసుకు రాబోతున్నారు. బింబిసారా రాజ్యాన్ని, యుద్దాలు చూపిస్తూ పీరియాడిక్ మూవీగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం వశిష్ఠ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తరువాత బింబిసారా ప్రీక్వెల్ మొదలు పెట్టబోతున్నారు.